Mahesh Babu Krishna : పెద్దకర్మ రోజు మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. తండ్రి కృష్ణను గుర్తు చేసుకొని మరీ ఉద్వేగానికి గురయ్యారు. కృష్ణ పెద్దకర్మను హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో అభిమానుల సమక్షంలో మహేష్ నిర్వహించారు. ఈనెల 15న అనారోగ్యంతో చనిపోయిన కృష్ణ సంస్మరణకు సభకు ఆయన ఫ్యామిలీతోపాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, మంత్రి తలసాని, అభిమానులు తరలివచ్చారు. వారందరికీ పెద్దకర్మ సందర్భంగా మంచి భోజనాలు పెట్టించారు మహేష్ బాబు. దాదాపు 5వేల మంది కృష్ణ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.వివిధ రకాల వంటకాలు వారికి వడ్డించారు.

సంస్మరణ సభలో కృష్ణ విగ్రహాన్ని మహేష్ ఆవిష్కరించారు. మహేష్ ఫ్యామిలీతోపాటు సుధీర్ బాబు, ఆదిశేషగిరిరావు , ఇతర కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.
‘నాన్న గారు నాకు వెలకట్టలేని అభిమానులను ఇచ్చారు. ఆ అభిమానం నాకు ఎంతో విలువైనది. నాన్న గారు నా గుండెల్లో.. మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఆయన మన మధ్యే ఉంటారు’ అంటూ కృష్ణను గుర్తు చేసుకొని మహేష్ ఉద్వేగానికి గురయ్యారు.
ఇక హీరో సుధీర్ బాబు సైతం మామ కృష్ణను తలుచుకొని బోరున ఏడ్చేశారు. ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడిగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా కృష్ణ సంస్మరణ సభలో అటు మహేష్, ఇటు సుధీర్ బాబు ఉద్వేగంతో నోట మాట మాట్లాడలేకపోయారు. కృష్ణను తలుచుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యారు.