మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా దాదాపుగా ఖరారైన సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలిన ఈ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఉగాది రోజునే ప్రకటన వస్తుందనే ప్రచారం కూడా సాగింది. కానీ.. అది జరగలేదు. మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా.. మే 31 అనౌన్స్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీచేయాలని వీరిద్దరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ.. మూడో సినిమాకు ముహూర్తం రావడానికి పదేళ్లు పట్టింది. అదికూడా.. అనూహ్యమైన పరిస్థితుల్లో వీరి కాంబో సెట్ కావడం విచిత్రం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సర్కారు వారి పాట’ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే.. మహేష్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ విషయంలో ఇటు ఫ్యాన్స్ తోపాటు అటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగానే ఉన్నారు. వీరి మొదటి సినిమా ‘అతడు’.. సీరియస్ గా సాగే ఫ్యామిలీ ఫన్ డ్రామా. ‘ఖలేజా’ విషయానికి వస్తే.. కామెడీ ప్రధానంగా సాగిన యాక్షన్ మూవీ. మరి, హ్యాట్రిక్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరం.
ప్రస్తుతం త్రివిక్రమ్ వద్ద ఓ పాన్ ఇండియా మూవీతోపాటు.. కేజీఎఫ్ లాంటి కథ కూడా సిద్ధంగా ఉందట. ఇవి కాకుండా మరో మూడునాలుగు స్టోరీలు కూడా రెడీ ఉన్నాయట. అయితే.. వీటిలో ఏదో ఒకటి పిక్ చేసుకోవట్లేదట. మహేష్ కోసం కొత్తగా మరో స్టోరీ సిద్ధం చేసే పనిలో పడ్డాడట మాటల మాంత్రికుడు. అది అతడు మూవీ తరహాలో ఉంటుందని టాక్. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది చూడాలి.