Mahesh Babu: ఒక హిట్ ఇచ్చిన దర్శకుడితో వరస చిత్రాలు చేయడం మహేష్ కి అలవాటు. మహేష్ కెరీర్లో ఒక్కడు అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది. ఆ మూవీ తెరకెక్కించిన గుణశేఖర్ మహేష్ ఫేవరేట్ అయిపోయాడు. వరుసగా అర్జున్, సైనికుడు చిత్రాలు చేశాడు. అర్జున్ పర్లేదు అనిపించుకుంది. సైనికుడు మాత్రం దెబ్బేసింది. పోకిరితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరికి బిజినెస్ మాన్ మూవీతో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇక అతడు వంటి క్లాసిక్ ఇచ్చిన త్రివిక్రమ్ కి రెండు ఛాన్సులు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలకు బ్రహ్మోత్సవం తో ఒక ఛాన్స్, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీను వైట్లలో ఆగడు అంటూ మరో ఛాన్స్ ఇచ్చాడు.

శ్రీమంతుడు మహేష్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివతో భరత్ అనే నేను అంటూ పొలిటికల్ థ్రిల్లర్ చేశారు. ఇలా మహేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడికి పిలిచి మరీ మరో ఆఫర్ ఇస్తాడు. కానీ వంశీ పైడిపల్లికి హ్యాండ్ ఇచ్చాడు. 2019లో విడుదలైన మహర్షి సూపర్ హిట్. మహేష్ చేసిన మంచి చిత్రాల్లో అది కూడా ఒకటి. మహర్షి మూవీతో వంశీ పైడిపల్లి మహేష్ కి ఆప్తుడు అయ్యాడు.
మహేష్ ఎక్కడికెళ్లినా వంశీ పైడిపల్లి కూడా ఆయనకు తోడు ఉండేవాడు. గత క్రికెట్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో జరగ్గా మహేష్ ఫ్యామిలీ వెళ్లారు. వారితో వంశీ పైడిపల్లి జాయిన్ అయ్యాడు. మరో చిత్రం మనం చేస్తున్నామని మహేష్ వంశీ పైడిపల్లికి హామీ ఇచ్చాడు. దీంతో నా నెక్స్ట్ మూవీ మహేష్ తో అంటూ వంశీ మీడియాతో కూడా చెప్పాడు. అనూహ్యంగా స్క్రిప్ట్ నచ్చని మహేష్… వంశీని వెయిటింగ్ లో పెట్టేశాడు. వంశీ పైడిపల్లి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా మహేష్ ఓకే చేయలేదు.

మహేష్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడానికి కారణం రెమ్యూనరేషన్ అన్న వాదనలు వినిపించాయి. స్క్రిప్ట్ నచ్చకే ఆయన వంశీ పైడిపల్లి మూవీ రిజెక్ట్ చేశాడని వారసుడు మూవీ ట్రైలర్ చూశాక అర్థమైంది. దిల్ రాజు మహేష్ తో అనుకున్న వారసుడు హీరో విజయ్ తో చేస్తున్నామని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో… మహేష్ నిర్ణయం మంచిదే అనిపిస్తుంది. వారసుడు కొత్త జాడీలో పెట్టిన పాత ఆవకాయ్ పచ్చడి అని తెలిసిపోయింది. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, శ్రీమంతుడు… ఇలా పలు చిత్రాలను మిక్స్ చేసి వారసుడు వండారని, స్పష్టం అవుతుంది. ఒక వేళ మహేష్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని ఉంటే తాను గతంలో చేసిన సినిమానే మళ్ళీ చేసినట్లు అయ్యేది.