Vijay Setupathi: ప్రముఖ హీరో విజయ్ సేతుపతిపై ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఎయిర్పోర్డులో దాడి చేసిన విషయం తెలిసిందే. దిల్లీలో జాతీయ అవార్డు అందుకుని వెళ్తున్న క్రమంలో బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు విజయ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
అదే సమయంలో విజయ్ సేతుపతిపై దాడి చేసిన వీడియోను షేర్ చేస్తూ.. హిందూ వాది అర్జున్ సంపత్ పేరిట మక్కల్ కట్చి సంస్థ పేరిట ట్వీట్ చేశారు. విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి ఒక్కో దెబ్బకు రూ. 1001 బహుమతి ఇస్తామని అందులో ప్రకటించారు. ఆ క్రమంలోనే విజయ్బై బహిరంగంగా బెదిరింపులకు పాల్పడినందుకు అర్జున్ సంపత్‌పై కొయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 504 (శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ పూర్వకంగా అవమానించడం), సెక్షన్ 506(1) (క్రిమినల్ బెదిరింపులకు పాల్పడడం) కింద అర్జున్ సంపత్‌పై కేసు ఫైల్ చేసినట్లు కోయంబత్తూరు పోలీసులు తెలిపారు.
ప్రముఖ స్వాతంత్రోద్యమ వీరుడు అయ్య తేవర్‌ను విజయ్ సేతుపతి అవమానించాడని, అతను క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టమని గతంలో అర్జున్ అన్నారు. అతను క్షమాపణలు చెప్పే వరకు.. ప్రతి తన్నుకు రూ.1001 రివార్డును అందజేస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.