‘దర్శకుడు కోదండరామిరెడ్డి’ విజయాల పరంపరకు బ్రేకులు పడని రోజులు అవి. పైగా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కూడా అది. అయితే బాలయ్య బాబు సినిమాలు మాత్రం వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. రాజకీయాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండటంతో, ఆయన బాలయ్య సినిమాల సంగతి ఎక్కువ పట్టించుకునే వారు కాదు. ఓ రోజు నటుడు చలపతిరావు ద్వారా బాలయ్య సినిమాల పరిస్థితి ఎన్టీఆర్ కి తెలిసింది. దాంతో ఎన్టీఆరే రంగంలోకి దిగి, బాలయ్యతో తానే ఓ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేశారు.
ఫామ్ లో ఉన్న కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా ‘అనసూయమ్మగారి అల్లుడు’ అంటూ ఓ సినిమాకి అంగీకారం తెలిపారు. అప్పటికీ కథ కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్ తో కథ రాయించి తీసుకువెళ్లారు. కానీ ఎన్టీఆర్ కథ వినలేదు. ‘బ్రదర్. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం’ అంటూ ఒక మాట అని వెళ్లిపోయారు. ‘సీఎం’ అయి ఉండి కూడా ఎన్టీఆర్ గారు దర్శక రచయితల మీద ఎంతో గౌరవం చూపించారు.
పైగా కథ కూడా వినకుండా సినిమా చేయమని వెళ్లిపోయారు. దాంతో కోదండరామిరెడ్డికి మరింత టెన్షన్ మొదలైంది. ఎలాగైనా ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని ఎంతో కష్టపడ్డారు. కట్ చేస్తే షూటింగ్ పూర్తి అయింది. మధ్యలో ఒకసారి మేనేజర్ వచ్చి ‘ఎన్టీఆర్ గారు మాట్లాడతారు’’ అంటూ కాల్ కనెక్ట్ చేసి ఇచ్చాడు. ఎన్టీఆర్ లైన్‌లోకి వచ్చి, ‘బ్రదర్, షూటింగ్ ముగిసింది అని విన్నాం, వెరీగుడ్. ఫస్ట్ కాపీ వచ్చాక కలిసి చూద్దాం’ అని ఫోన్ పెట్టేశారు.
కోదండరామిరెడ్డికి ఎక్కడో భయం. సినిమా తేడా జరిగితే, పెద్దాయన దగ్గర మాట వస్తోందే అని. ఆ అనుమానంతోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేశాడు. మరో నెల తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, ఫస్ట్ కాపీ చూడటానికి సీఎంగారు వస్తున్నారు. మీరు కూడా రావాలి సార్’ అని ముగించాడు. ఒక్కసారిగా కోదండరామిరెడ్డిలో భయం రెట్టింపు అయింది. ఎందుకంటే, సినిమా బాగా రాలేదు అని అప్పటికే ఎన్టీఆర్ గారికి చాలమంది చాల రకాలుగా చెప్పారు.
రామకృష్ణా స్టూడియోస్ లోని ప్రివ్యూ థియేటర్‌లో షో వేశారు. ఎన్టీఆర్ గారి పక్క సీట్ లోనే కోదండరామిరెడ్డిని కూర్చోపెట్టారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ గారికి సినిమా అంత గొప్పగా అనిపించలేదు. మరోపక్క కోదండరామిరెడ్డి ఎడమ చేయి ఫ్రాక్చర్ అయి, అది తీవ్రంగా నెప్పి పుడుతుంది. అంతలో ఇంటర్వెల్ పడింది. స్నాక్స్ వచ్చాయి.
కోదండరామిరెడ్డి చేతికి తగిలిన గాయాన్ని చూసి, ఎన్టీఆర్ గారు స్పూన్ తో కోదండరామిరెడ్డికి తినిపించడం మొదలుపెట్టారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా.. ఎన్టీఆర్ చూపించిన ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటుంటారు ఇప్పటికీ కోదండరామిరెడ్డి. ఏమైనా మనిషిని గౌరవించడంలో ఎన్టీఆర్ తరువాత ఎవరైనా.