Keerthy Suresh: ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నేడు తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్ తో గ్రాండ్ గా గోవా లో పెళ్లి చేసుకుంది. 15 ఏళ్ళ నుండి స్నేహితులుగా కొనసాగుతున్న వీళ్లు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కీర్తి సురేష్ ఈ ఏడాది దీపావళి పండుగ రోజు ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు చెప్పుకొచ్చింది. అంతకు ముందు ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ని వివాహం ఆడబోతున్నట్టు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో ఆ రూమర్స్ కి ఎండ్ కార్డు పడింది. ఆంటోనీ క్రిస్టియన్ మతానికి చెందిన వాడు అయినప్పటికీ కూడా వీళ్ళ వివాహం హిందూ సంప్రదాయంలో జరగడం గమనార్హం. నేడు సాయంత్రం మరోసారి చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయంలో మరోసారి వీళ్లిద్దరు వివాహం చేసుకోనున్నారు. ఇలా ఇరు మతాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ జంట ఒక్కటి అవ్వడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.
గోవాలో జరిగిన వీళ్లిద్దరి పెళ్ళికి బంధు మిత్రులు, సినీ ఇండస్ట్రీ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శుభలేఖలు ఇచ్చే సమయంలో ఈ జంట KA అనే పదంతో ముద్రించిన బ్యాండ్స్ ని కూడా అతిథులకు ఇచ్చారట. ఈ బ్యాండ్ ఉన్నవారు మాత్రమే పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇవ్వాలట. ఈ వివాహానికి మన టాలీవుడ్ నుండి నేచురల్ స్టార్ నాని తన సతీమణితో కలిసి హాజరయ్యాడు. కీర్తి సురేష్ నాని కి మంచి స్నేహితురాలు అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు లాగా క్లోజ్ గా ఉంటారు. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని నాని చెప్పుకొచ్చాడు. నానితో పాటు రామ్ పోతినేని, మరియు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారట. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా వీళ్లిద్దరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో ఈమె బేబీ జాన్ అనే చిత్రంలో నటించింది. తమిళ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘తేరి’ కి ఇది రీమేక్. తేరి లో సమంత పోషించిన పాత్రని ‘బేబీ జాన్’ లో కీర్తి సురేష్ చేసింది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అట్లీ ఈ చిత్రానికి నిర్మాత. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది వరకు కేవలం సౌత్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చిన కీర్తి సురేష్, ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి తొలిసారిగా అడుగుపెట్టింది. మరి ఆమె అదృష్టం బాలీవుడ్ లో ఎలా ఉందో చూడాలి.
View this post on Instagram