CM KCR- Superstar Krishna: ఆయన సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు ఎంతో కష్టంతో కూడుకున్నదే. ఏలూరు కళాశాలలో చదివే రోజుల్లో కళాశాలలో డాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావుకు జరిగిన సన్మానం చూశాక ఆయనలో నటుడవ్వాలనే కోరిక కలిగింది. తండ్రికి చెప్పి ఆయన అనుమతితో మద్రాస్ బయలుదేరారు. అక్కడ పలువురిని కలిసి తన కోరిక బయటపెట్టాడు. అప్పటికి ఆయన వయసు చిన్నది కావడంతో కొంత కాలం ఆగాలని సీనియర్లు చెప్పిన సూచనలతో నటనలో శిక్షణ తీసుకుని అక్కడే ఉన్నాడు. మొదట చిన్నచిన్న వేషాలతో కనిపించినా తేనెమనసులు చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. ఆయన ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. పేరు ఇంత పెద్దగా ఉండకూడదని చిన్నగా కృష్ణగా మార్చుకుని చలన చిత్ర రంగాన్ని ఏలారు. తనదైన నటనతో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి తన సత్తా చాటారు.

కృష్ణ నవంబర్ 15న ఉదయం తెల్లవారు జామున నాలుగు గంటలకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూతుది శ్వాస విడిచారు. దాదాపు 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సింహాసనం సంచలనం సృష్టించింది. అల్లూరి సీతారామరాజు చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వంచే బంగారు నంది బహుమతి అందుకున్నారు. పద్మాలయ స్టూడియా స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మించారు. అల్లూరి సీతారామరాజు కూడా ఆయన నిర్మించినదే కావడం గమనార్హం. అలా చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.

కృష్ణ మరణంపై ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. తెలుగు చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగారని కొనియాడారు. తాను అల్లూరి సీతారామరాజు చాలా సార్లు చూశానని కేసీఆర్ కృష్ణకు చెప్పినా నవ్వేవారని చెప్పారు. మీరు కూడా సినిమాలు చూస్తారా అని అనేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినిమా రంగం జీర్ణించుకోలేదని బాధాతప్త హృదయంతో పేర్కొన్నారు.

అనంతరం మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. అంత్యక్రియల గురించి చర్చించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రేపు మధ్యాహ్నం గచ్చిబౌలి స్టేడియం నుంచి మహాప్రస్థానం వరకు ర్యాలీగా తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ తోపాటు మంత్రి హరీష్ రావు వచ్చారు. వారికంటే ముందే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించి మహేశ్ బాబును ఓదార్చి వెళ్లారు.