Superstar Krishna- KCR: సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం దాదాపు 4 గంటల సమయంలో కన్నుమూశారు. తెలుగు చలన చిత్ర రంగంలో అయిదు దశాబ్దాల పాటు తనదైన శైలిలో మెప్పించిన నటుడు కృష్ణ. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న జన్మించారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణ మరణంపై తన సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర రంగానికి ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడిగా ఆయన ప్రస్థానం ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణ మరణం పట్ల సంతాపం తెలిపారు. జేమ్స్ బాండ్ గా ఆయన అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణ నటన అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. సినీ రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అలరించారని అన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కృష్ణ మరణం అందరిని కలచివేసిందని విషాదం వ్యక్తం చేశారు.
కృష్ణ అనారోగ్యంతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఇంట్లోనే స్ర్పహ తప్పిపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు విపరీతంగా శ్రమించినా ఫలితం లేదు. ఆయన అవయవాలు అన్ని దెబ్బ తినడంతో ఆయన కోలుకోలేదు. ఈ నేపథ్యంలో తెల్లవారు జామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతికి గురయింది. తెలుగు సినీరంగం ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని కన్నీటి పర్యంతమైంది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడం బాధాకరం.

80 ఏళ్ల వయసులో గుండెపోటు, శ్వాస సంబంధ సమస్యలతో తుది శ్వాస విడిచారు. కృష్ణ ఆరోగ్యం విషమించగానే వైద్యులు 48 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేమని అనడంతో కుటుంబ సభ్యులు కూడా సరేననడంతో ఆయనకు చికిత్స కొనసాగించినా ఫలితం రాలేదు. చివరకు ఆయన దివికేగారు. సూపర్ స్టార్ గా తెలుగు వారి గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నటశేఖరుడు ఇక లేడనే వార్త అందరిని కలచివేస్తోంది. అయిదు దశాబ్దాల పాటు అభిమానుల గుండెల్లో నిండిపోయిన కృష్ణ మరణం అందరిలో విషాదం నింపింది.