KBC 16: తెలుగు మీడియా ఓ దరిద్రం.. ప్రతిరోజు దిక్కుమాలిన రాజకీయ వార్తలను పతాక శీర్షికలుగా ప్రచురిస్తుంటుంది. దాని మేనేజ్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా మన మెదడు లో రాజకీయ విషాన్ని నింపుతుంది. దీన్ని మనం ఏం చేయలేము గాని.. సోషల్ మీడియాలో ఒక వార్త కనిపించింది. అది నిజమా? కాదా? అని పరిశీలిస్తుంటే ప్రఖ్యాత టైమ్స్ లోనూ దర్శనమిచ్చింది. ఆ వార్త చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపించింది. అయితే 11 పది రోజుల క్రితం నాటిది.. ఇటీవల కాన్ బనేగా కరోడ్ పతి 49వ ఎపిసోడ్ జరిగింది. హాట్ సీట్ లో డాక్టర్ నీరజ్ సక్సేనా కూర్చున్నారు. గంభీరంగా ఉన్నారు. తన హుందతనాన్ని ప్రదర్శించారు. ఆయన వచ్చినప్పుడు భీకరమైన ఎలివేషన్లు లేవు. అమితాబ్ బచ్చన్ కాళ్ళు మొక్కడాలు లేవు. ఆనందభాష్పాలు రాల్చడాలు కూడా లేవు. నీరజ్ కోల్ కతా లోని జె ఎస్ ఐ యూనివర్సిటీ ప్రొ – ఛాన్స్ లర్ గా పనిచేస్తున్నారు.. ఆయన అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశారు. అబ్దుల్ కలాం ప్రభావం ఆయన మీద విపరీతంగా ఉండేది. మొదట్లో తన గురించి మాత్రమే నీరజ్ ఆలోచించేవారు. ఆ తర్వాత దేశం గురించి, ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.. ఆట మొదలైంది.. అమితాబ్ ప్రశ్నలు వేస్తుంటే చెప్పుకుంటూ పోయారు. వేగంగా 3.2 లక్షల వరకు చేరుకున్నారు. ఒక్కసారి మాత్రమే ప్రేక్షకుల పోల్ లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు. 3.2 లక్షల వరకు చేరుకోగానే అమితాబ్ తో గేమ్ ఆపేద్దామని నీరజ్ అన్నారు. దానికి అమితాబ్ ఆశ్చర్యపోయారు..
ఇదే తొలిసారి..
నీరజ్ దూకుడు చూస్తే కోటి రూపాయల దాకా చేరుకోగలడని అమితాబ్ అనుకున్నారు. కానీ ఆయన ఆటను మధ్యలోనే ముగిస్తానని చెప్పడం అమితాబ్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలామంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని.. వాళ్లకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని.. ఆ జాబితాలో తనకంటే చిన్నవాళ్ళు ఉన్నారని నీరజ్ చెప్పడంతో అమితాబ్ ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. తన సీట్ లో నుంచి లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు..” ఇది చాలా గొప్పగా ఉంది. నేను కూడా మీ నుంచి చాలా నేర్చుకున్నాను. మీలాంటి మనుషులను చూడడం అత్యంత అరుదుగా అనిపిస్తోంది. ఇతరులకు అవకాశం ఇవ్వాలనే మీ ఆలోచన నాకు నచ్చింది. ఇప్పటివరకు పొందింది చాలు, కూడా ఇద్దామనే మీ వ్యక్తిత్వం సానుకూల దృక్పథాన్ని కలిగిస్తోందని” అమితా వ్యాఖ్యానించారు. నీరజ్ అనంతరం ఓ అమ్మాయి హాట్ సీట్ లోకి వచ్చింది. ఆ అమ్మాయి కి ఇద్దరితోబుట్టువులు.. వారంతా కూడా ఆడపిల్లలే. ఆడపిల్లలు పుట్టారని ఆమె తండ్రి వదిలి వెళ్ళిపోయారు. దీంతో వారు అనాధ ఆశ్రమంలో ఉంటున్నారు. ఆ అమ్మాయి వేగంగా సమాధానం చెప్పి 3.2 లక్షలు గెలుచుకుంది. ఒకవేళ నీరజ్ అవకాశం ఇవ్వకుండా ఉంటే ఆమె అక్కడిదాకా వచ్చేది కాదు.
జీవిత సత్యం
నీరజ్ ప్రబోధించిన జీవిత సత్యం అమితాబ్ బచ్చన్ ను కదిలించింది. గొప్పగా బతకాలంటే కష్టపడాలి.. ఉన్నతంగా నిలవాలంటే కాస్త అదృష్టం తోడు కావాలి. మహోన్నతంగా నిలబడాలంటే.. హుందాతనాన్ని దానికి తోడు చేసుకోవాలంటే ఇతరులకు అవకాశాలు ఇవ్వాలి. దక్కింది చాలు.. దొరికింది చాలు.. అనే ఆత్మసంతృప్తి భావనను అలవర్చుకోవాలి. అప్పుడే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది. ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నీరజ్ నిరూపించారు. అతడి వ్యక్తిత్వానికి అమితాబ్ లేచి నిలబడ్డారు. తన చేతులతో చప్పట్లు కొట్టి అభినందించారు..
టైమ్స్ రాసిన ఇంకా మిగతా విషయాలు ఏంటంటే..
నీరజ్ కు సూపర్ విభాగంలో “తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?”, “స్విట్జర్లాండ్ లాసానే మ్యూజియంలో అభినవ్ బింద్రకు సంబంధించిన ఏ వస్తువును భద్రపరిచారు” నే ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఇక ఇదే క్రమంలో కలాం గురించి నీరజ్ మరింత గొప్పగా చెప్పారు. “ఆలోచనలు చిన్నవిగా ఉండడం కూడా నేరం. అవి గొప్పగా ఉండాలి.. prudhvi, Agni, trishul, Nag, Aakash వంటి వాటిని తయారు చేశారు కాబట్టి.. P A T N A నగరంలో ఆ క్షిపణుల మొదటి అక్షరాలు ఉంటాయి కాబట్టి ఆయన తరచూ పాట్నా వెళ్లేవారని” నీరజ్ అబ్దుల్ కలాం కు సంబంధించిన సరికొత్త విషయాలను వెల్లడించారు. కాగా, 3.2 లక్షలు గెలుచుకుని.. బోనస్ గా అంతే మొత్తాన్ని అందుకొని.. మొత్తంగా 6.4 లక్షలు తనతో పాటు తీసుకెళ్లాడు.. ఆ తర్వాత వచ్చిన సోనియా రిజువాని అనే అమ్మాయి 3.2 లక్షలు తీసుకెళ్లింది.