Kantara Movie Collections : కేవలం 13 కోట్లతో నిర్మితమై.. ప్రాంతీయ భాషా చిత్రంగా విడుదలైన కాంతారా ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబాళే ఫిలిమ్స్ కు కనివిని స్థాయిలో లాభాలను తెచ్చిపెడుతోంది. విడుదలయి 50 రోజులకు దగ్గరగా వస్తున్నా ఇప్పటికీ కర్ణాటకలో హౌస్ ఫుల్ షోలతో ప్రదర్శితమవుతోంది. సినిమా ప్రచారం కోసం దర్శకులు, హీరోలు ఆపసోపలు పడుతున్న నేటి తరుణంలో ఒక కన్నడ సినిమాగా విడుదలై కేవలం మౌత్ టాక్ తోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ఓటీటీ లో ఎప్పుడంటే
ఇటీవల కాలంలో థియేటర్లో విడుదలైన పది రోజులకే ఓటిటికి వచ్చిన సినిమాలు ఎన్నో. ఇందులో అగ్ర కథానాయకుల సినిమాలు ఉన్నాయి. మరి కాంతారా ఎందుకు ఆలస్యమవుతుంది అంటే దానికి కారణాలు బోలెడు. సెప్టెంబర్ 30న కాంతారా సినిమా కన్నడలో విడుదలైంది. విడుదలైన రెండో రోజే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ భాషల్లో చకచకా డబ్బింగ్ పూర్తి చేసి విడుదల చేశారు. ఆ తర్వాత మలయాళం, తమిళంలోనూ విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. అక్టోబర్ 15న తెలుగులో కాంతారా విడుదలైంది. విడుదలై నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి వసూళ్ళు వస్తున్నాయి. మూడు వారాలుగా ఇటు తెలుగు , అటు హిందీ భాషల్లో విడుదలయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేదు. దీంతో ప్రేక్షకులకు కాంతారా ఏకైక ఆప్షన్ గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన చూసేందుకు చాలామంది రెండోసారి థియేటర్‌కు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్‌కు రెండోసారి రప్పించిన సినిమా ఏదైనా ఉందంటే అది కాంతారా మాత్రమే.
రికార్డులు బద్దలు
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కాంతారావు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వసూలు దక్కించుకుంది. హిందీలో డెబ్బై కోట్లు, తెలుగులో 50 కోట్లు దాటేసింది. కర్ణాటకలో కూటికి పైగా కాంతారా టికెట్లు అమ్ముడుపోయాయి. ఒక బెంగళూరులోనే 17,700 షోలు ప్రదర్శించారు. ఇంతకు ముందుకు కేజీఎఫ్ 2 పేరిట 16, 800 షోల రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల కాలంలో హిందీలో సింగిల్ డే (24వ రోజు) అత్యధికంగా 4.50 కోట్లు సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. అమెరికాలో 2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
ఆ ఆలోచన లేదు
రికార్డులు బద్దలు కొడుతూ దూసకుపోతున్న కాంతారా సినిమాని ఇప్పట్లో ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని హోంబళే ఫిలిమ్స్ అంటోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబరు 4 న విడుదల కావాలి. తర్వాత అది 18వ తేదీకి మారింది. సినిమా విడుదలైన తర్వాత నిర్ణయించుకున్న తేదీకి ఓటీటీలో చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇంకాస్త ఆగి విడుదల చేస్తే సినిమాకు మంచి క్రేజీ వస్తుందని సదరు సంస్థ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కుదిరితే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లు వసూలు చేసిన తర్వాత కాంతారా ఓతీటీలో విడుదల చేస్తారని టాక్.