Kantara Collections: భూతకోల నేపథ్యంలో వచ్చిన కాంతారా సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీపావళి కి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే అన్నట్టుగా ప్రదర్శితమవుతున్నది. అసాధ్యం అనిపించే ఘనతలను సుసాధ్యం చేస్తున్నది. ఈ చిత్రాన్ని నిర్మించిన హోం బాలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన సినిమాల అన్నింటిలో అత్యధికంగా ఫుట్ ఫాల్స్ తెచ్చుకున్న చిత్రంగా మరో బెంచ్ మార్క్ సెట్ చేసుకుంది. ఇప్పటివరకు కేజిఎఫ్ 2 పేరుమీద 77 లక్షల ఫుట్ ఫాల్స్ ఉండేవి. కానీ దానిని కాంతారా సినిమా దాటేసింది. ఏకంగా 90 లక్షల ఫుట్ ఫాల్స్ తో కొత్త రికార్డును సృష్టించింది. వారంలో ఇది కోటికి చేరే అవకాశం ఉందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇది శాండల్ వుడ్ లో హైయెస్ట్ కాకపోయినా కే జి ఎఫ్ ని క్రాస్ చేయడం మాత్రం సంచలనమే. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ మీడియాకు వెల్లడించడం గమనార్హం.

వసూళ్లలోనూ అదే ఒరవడి
భూతకోల నేపథ్యంలో వచ్చిన కాంతారా సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇక్కడ ఏమాత్రం మార్కెట్ లేని రిషబ్ శెట్టి ఆ స్థాయిలో షేర్ రాబట్టాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇంత మొత్తంలో ఒక కన్నడ డబ్బింగ్ సినిమా కలెక్షన్లు సాధించడం ఇది మూడోసారి మాత్రమే.. కే జి ఎఫ్ 2 ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతోంది. కానీ దానికి పెంచిన టికెట్ రేట్లు, స్క్రీన్ కౌంట్, జరిగిన బిజినెస్ దృష్ట్యా కాంతారా అనే సినిమా చాలా చిన్నది. అయినప్పటికీ రెండవ స్థానం దక్కించుకోవడం విశేషం. ఇంకొక మూడు వారాలపాటు కచ్చితంగా స్మూత్ రన్ కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదే జరిగితే 25 కోట్ల ఫిగర్ రీచ్ కావడం మరి అసాధ్యం కాదని పేర్కొంటున్నారు. ఇది గనక సాధ్యమైతే పెట్టిన పెట్టుబడికి పదింతల లాభం తెచ్చిన ఘనత కాంతారా కే దక్కుతుంది. అందుకే టీం కూడా ప్రమోషనల్ ఈవెంట్లలో ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది.

కేవలం రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన కాంతారకు ఇంత రెస్పాన్స్ రావడం. ఒక కేజీఎఫ్1 తెచ్చింది 13 కోట్లే. అది కూడా అంత హైప్ లో.. కానీ సైలెంట్ కిల్లర్ గా వచ్చిన కాంతారా ఊహకందని రీతిలో సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. దీపావళి నాడు కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. జిన్నా, ఓరి దేవుడా, ప్రిన్స్, సర్దార్ సినిమాలు కాంతారా ముందు వెలవెలబోతున్నాయంటే రిషబ్ శెట్టి మ్యాజిక్ ను అర్థం చేసుకోవచ్చు.. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో ఓటిపి ఉండొచ్చని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా కదిలించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని రిషబ్ శెట్టి ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. దానిని మరింత గ్రాండీయర్ గా తెరకెక్కించేందుకు హోం బాలే ఫిలిమ్స్ సన్నాహాలు చేస్తోంది.