మూవీ టైటిల్: కాంతార: చాప్టర్ 1
నటీనటులు: రిషభ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఛాయాగ్రహణం: అరవింద్ కశ్యప్
Kantara chapter 1 Review : ఒక గోడ కట్టినట్టు.. ఒక మొక్కకు అంటకట్టినట్టు.. ఎంతో పద్ధతిగా తీస్తేనే.. సినిమాలు ఆడుతాయి.. ఊహించని విజయాన్ని అందుకుంటాయి.. అలా కొన్ని సార్లే జరుగుతుంటాయి. అందుకే అంటారు… అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయని… మళ్లీ మళ్లీ ఆ మూమెంట్ రాదు.. అంతకుమించి ఆశించడం కూడా మన తప్పే.. దానికి అన్నీ కలిసి రావాలి. ఒక సినిమా హిట్ అయితే దానికి సెకండ్ పార్ట్ లేదా ఫ్రాంచైజీ సినిమాలు తీయడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. చాలా సందర్భాలలో మొదటి పార్ట్ ను మ్యాచ్ చేయడం కష్టం. కాంతారా లాంటి కమర్షియల్ సక్సెస్ ప్లస్ అవార్డులు సాధించిన సినిమా ఫ్రాంచైజీలో భాగంగా కాంతారా: చాప్టర్ 1 దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శక నటుడిగా రిషభ్ శెట్టి ఈ ప్రీక్వెల్ తో అంచనాలు అందుకున్నాడా లేదా తడబడ్డాడా.. పదండి రివ్యూలో చూద్దాం.
కథ
ఎనిమిదవ శతాబ్దంలో పరమశివుడు కైలాసం నుంచి దక్షిణ భారతానికి వచ్చి తపస్సు చేసిన ప్రదేశమే కాంతార. శివయ్య తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని పూల మొక్కలతో, సుగంధ ద్రవ్యాలతో, చెట్లతో అందమైన పూదోటగా మారుస్తుంది. దాన్నీ ఈశ్వరుని పూదోట అంటారు. అక్కడే ఒక శివలింగం కూడా వెలుస్తుంది. ఈ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని కాంతార వాసుల నమ్మకం.
అడవి పక్కనే ఉన్న బాంగ్రా రాజు ఈ విషయం తేల్చే ప్రయత్నంలో తన కొడుకు విజయేంద్ర(జయరాం) కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతాడు. దీంతో విజయేంద్ర తన పిల్లలైన కులశేఖర(గుల్షన్ దేవయ్య), కనకవతి (రుక్మిణి వసంత్) ను కాంతార కు దూరంగా ఉంచుతాడు. అయితే కులశేఖర మాత్రం తండ్రిమాట వినకుండా కాంతార లోకి అడుగుపెట్టడంతో కొన్ని సంఘటనలు జరుగుతాయి.
ఇదిలా ఉంటే బెర్మె(రిషభ్ శెట్టి) అనే అబ్బాయి చిన్నవయసులో కాంతారలోని గిరిజనులకు దొరుకుతాడు. చిన్న పిల్లాడిని ఓ పెద్ద పులి కావలి కాస్తుండడం చూసి దైవిక శక్తులు ఉన్నాయని వారు నమ్ముతారు. ఈ అబ్బాయిని వారే పెంచుతారు. అతడే పెద్దయిన తర్వాత కాంతారకు రక్షకుడిగా మారతాడు. వీరికి తోడు కడపటి దిక్కువారు అనే ఒక తెగ ఆ శివలింగం తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటు బాంగ్రా రాజు, ఇటు కడపటి దిక్కువారు కన్నేసిన కాంతారను బెర్మె(రిషభ్ శెట్టి) దైవిక శక్తుల సాయంతో ఎలా కాపాడుకున్నాడు అనేది కూడా చెప్పేస్తే ఇక సస్పెన్స్ ఏమీ మిగలదు కాబట్టి ఇంతటితో కథనాపుదాం.
Also Read : ‘ఓజీ’ మేనియా కి ‘కాంతారా 2’ బ్రేకులు వేయనుందా..? ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందంటే!
విశ్లేషణ:
కథ చదువుతూ ఉన్నప్పుడు “కొంత కంగాళీగా ఉందే” అని మీ మనసుకు అనిపించిందంటే మీరు మహా తెలివైనవారు. అనుమానమే లేదు. కాంతార మొదటి భాగం కథ ఎంతో ఆర్గానిక్ గా సింపుల్ గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఉంటుంది. కానీ ఈ చాప్టర్ -1 మాత్రం చాలా భారీ స్థాయిలో రాసి, తీసినందువల్ల సహజత్వం చాలావరకూ దూరమైంది. అలా అని సినిమాలో మంచి ఎపిసోడ్స్ లేవా అంటే అద్భుతః అనిపించే ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి. రిషభ్ శెట్టి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు పులి ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్, అన్నీ సరిగ్గా కుదిరాయి. కానీ సినిమా అంతా చూసిన తర్వాత ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ వస్తుంది.
మొదటి భాగం చూడకుండా ఇది చూస్తే బాగుందని అనిపించవచ్చేమో కానీ మొదటి భాగం చూసినవారికి రెండు మూడు అంశాలలో నిరాశ తప్పదు. అందులో ఒకటి హీరో ఆర్క్. మొదట్లో అల్లరిగా తిరిగే హీరో పాత్రనే చివరికి దైవం పూనడం. వరాహరూపం పాట వచ్చేసరికి పీక్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ హీరో ఆర్క్ అంతగా కుదరలేదు. పైగా మొదటి భాగంలో చూసినదే ఇందులో రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. రెండో అంశం డబ్బింగ్. ముఖ్యంగా గుల్షన్ దేవయ్య పాత్ర డబ్బింగ్ సెట్ అవలేదు. సినిమాలో డైలాగ్స్ కూడా వీక్ గా ఉన్నాయి. ఇక కడపటి దిక్కు తెగ ను చూస్తే కంగువ సినిమా కాసేపు గుర్తుకూడా రావొచ్చు. సినిమాలో ఎమోషన్ కూడా అంతగా క్యారీ అవలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఇదో మిశ్రమ అనుభూతినిచ్చే సినిమానే.
నటీ నటుల విషయానికి వస్తే రిషభ్ శెట్టి తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. జయరాం, రుక్మిణి వసంత్ కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. రుక్మిణి కి పెర్ఫార్మన్స్ చేసే స్కోప్ దక్కింది. ఈ సినిమాలో తన పాత్ర ఒక సర్ప్రైజ్. గుల్షన్ దేవయ్య నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు కానీ తెలుగు డబ్బింగ్ తేడా కొట్టింది. ఇక టెక్నికల్ అంశాలు చూసుకుంటే అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాగుంది. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫుల్ మార్క్స్ పడతాయి కానీ పాటల విషయంలో కొంత ఇంపాక్ట్ తగ్గింది. మళ్ళీ మొదటి పార్ట్ తో పోలికేంట్రా బాబూ అని మీరు చిరాకు పడకపోతే ఒక విషయం చెప్పాలి. వరాహరూపం పాట.. ఓ ఓ అరుపు రెండూ ప్రేక్షకుడిని మొదటి పార్ట్ లో మెస్మరైజ్ చేశాయి. ఇందులో అవి డెఫినిట్ గా మిస్సింగ్. ఎక్కువ ఆశించకుండా ఓ.. అని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే సినిమా నచ్చుతుంది.
ఓవరాల్ గా చూస్తే.. మొదటి పార్ట్ హిట్ అయ్యిందని ఈసారి అంతకుమించి తీయాలని చూశారు. కానీ మొదటి పార్ట్ లో ఏముందో రెండో పార్ట్ లో అదే మిస్ అయ్యారు. అంచనాల కోసం సెకండ్ పార్ట్ కు సొబగులు అద్ది కొంచెం నేల విడిచి సాము చేసినట్టుగా అనిపిస్తోంది. అలా అని బాగోలేదని కాదు.. నాట్ బ్యాడ్.. కానీ మొదటి దానికి మించి కాదు..
ప్లస్సులు:
-విజువల్ ఎఫెక్ట్స్
-సినిమాటో గ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– రిషభ్ శెట్టి నటన
మైనసులు:
-భారీ స్థాయిలో కథను కమర్షియల్ గా చెప్పాలనుకోవడం
– సహజత్వం మిస్ కావడం.
చివరి మాట: మ్యాజిక్ మిస్ అయిన కాంతార
రేటింగ్: 2.5/5
– ✍️ by Ramu Kovuru
ALSO Read : ‘కాంతారా 2’ మూవీ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..హిట్టా..ఫట్టా?
