Kantara 2 Censor: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి ‘కాంతారా 2′(Kantara 2 ). రిషబ్ శెట్టి(Rishab shetty) హీరో గా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతారా’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన కళ్లారా చూసాము. ‘కాంతారా 2’ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని ఆ సినిమాకు సంబంధించిన మేకర్స్ బలమైన విశ్వాసంతో ఉన్నారు. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA 16+ సర్టిఫికెట్ ని జారీ చేసింది.
సినిమా నిడివి దాదాపుగా 2 గంటల 48 నిమిషాల వరకు ఉంటుందట. అయితే సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 16+ అని ఇచ్చారంటే, కేవలం 16 ఏళ్ళ వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే చూసే సినిమా అన్నమాట. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ సినిమాని చూసేందుకు అర్హులు కాదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో అనుమతిస్తారేమో కానీ, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మాత్రం అనుమతించడం కష్టం. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రాంతాల్లో అసలు కుదరదు. ఈ సినిమా కంటే వారం రోజుల ముందు విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓజీ కి అయితే A సర్టిఫికేట్ ని ఇచ్చారు. అంటే 18 వయస్సు కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ సినిమాని చూసేందుకు అర్హులు కాదు. దసరా కానుకగా వచ్చే ఈ రెండు సినిమాలకు ఇలాంటి లిమిటేషన్స్ ఇవ్వడం గమనార్హం.
అయితే దేవుడి మీద తీసిన సినిమాకు ఈ పరిమితులు ఏంటి? అనే సందేహం ప్రేక్షకుల్లో ఏర్పడింది. కాంతారా క్లైమాక్స్ సన్నివేశాన్ని అంత తేలికగా జనాలు మర్చిపోలేరు. ఇందులో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అంతే కాకుండా ఆ సన్నివేశం లో హింస కూడా ఉంది. అలాంటి సన్నివేశాలు కాంతారా చిత్రం లో చాలానే ఉన్నాయట. అందుకే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు పరిమితులు పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు చాలా స్లో గానే అనిపిస్తుంది కానీ, సెకండ్ హాఫ్ లో మాత్రం రెండు భారీ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట. రిషబ్ శెట్టి కి మరో నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.