Kangana: ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ.. వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. తాజాగా, మరోసారి ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదని.. అది కేవలం బ్రిటిష్ వారు పెట్టిన భిక్ష అని కంగనా తెలిపింది. కాంగ్రెస్ హయాంలో బ్రిటిష్ పాలన కొనసాగిందని.. 2014లో దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
దీంతో, దేశం కోసం త్యాగాలు చేసిన వారిని అవమానించడం ఏంటని నెటిజన్లు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ వరుణ్ గాంధీ కంగనాపై విరుచుకుపడ్డారు. రైతు ఉద్యమంపై ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వరుణ్.. తాజాగా కంగనా వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. అసలు కంగనకు పిచ్చిపట్టిందా… లేక దేశద్రోహమా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలన బ్రిటీష్ పాలన పొడిగింపుగా పేర్కొంటూ… 2014లో దేశం నిజమైన స్వాతంత్ర్యం పొందంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ త్యాగాలను అవమానించడమే కాకుండా, గాంధీజీని హత్యచేసిన గాడ్సేను పొగిడారని.. ఇప్పుడు స్వాతంత్య్ర సమరయోధులను, వీరులను అగౌరవ పర్చడం సరికాదని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
కంగనా వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం కొత్త కాదు. ఇటీవల కాలంలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ.. వివాదాలను కొనితెచ్చుకుంటోంది. ఇటీవల పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న కంగనా.. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలపైనా వివాదం చెలరేగింది.