Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.. అయితే రాజకీయ నాయకుడిగా కాదు.. నవంబర్ 1న ఇక్కడ జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో తారక్ పాల్గొంటారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం రాజ్యోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నారు. కన్నడ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ఇది. దీనిని రాజ్ కుమార్ కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపు దీనిని ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కొందరు ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ను పిలవడం విశేషం.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత అక్టోబర్ 23న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం శాండిల్ వుడ్ నే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ విషాదం నింపింది. అందరితో చనువుగా ఉండే రాజ్ కుమార్ మరణంపై చాలా మంది కుంగిపోయారు. ఆయన మరణ వార్త తెలియగానే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు కర్ణాటక వెళ్లారు. రాజ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ తో జూనియర్ ఎన్టీఆర్ కు అన్యోన్య బంధం ఉంది. అందుకే ఆయన అవార్డు ఫంక్షన్ కు జూనియర్ ను ఆహ్వానించినట్లు సమాచారం.
సినిమాల్లో బిజీగా ఉన్న తారక్ ఇటీవల రాజకీయంగా కూడా ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ను పిలవడం ఆసక్తిగామారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రముఖులు జూనియర్ పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పునీత్ రాజ్ కుమార్ తో ఉన్న స్నేహం కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేగానీ ఎలాంటి రాజకీయాలకు తావులేదని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక జూనియర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లో భాగంగా జపాన్లో బిజీగా ఉన్నారు. వచ్చీ రాగానే కర్ణాటకలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. జూనియర్ తో పాటు మరి కొందరు హాజరయ్యే అవకాశం ఉంది. అటు తమిళ నాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించారు. అయితే ఈ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతారని అంటున్నారు. దీంతో ఆయన స్పీచ్ ఎలా ఉంటుందోనని అటు కన్నడ, ఇటు తెలుగు అభిమానులు ఎదురుచూస్తున్నారు.