Junior NTR: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీ వేదికగా ఆయన బొమ్మతో కూడిన రూ. 100 వెండి నాణెం విడుదల చేస్తున్నారు. నేడు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం లభించింది. నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పురంధేశ్వరితో పాటు ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు హాజరు కానున్నారు. ఇప్పటికే వీరందరూ ఢిల్లీ చేరుకున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కావడం లేదని సమాచారం.
ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల వేడుకకు ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం లభించింది. నిన్ననే ఎన్టీఆర్ ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. కానీ ఆయన హైదరాబాద్ లోనే ఉన్నట్లు సమాచారం. దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న పక్షంలో ఆయన ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఒక్కరోజు షూటింగ్ ఆగితే ఏమవుతుంది? ఎన్టీఆర్ కావాలనే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టాడనే వాదన మొదలైంది.
మే నెలల్లో హైదరాబాద్ వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం లభించింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం పాల్గొనలేదు. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఆయన విదేశాలకు వెళ్లారు. ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ లోని ఓ వర్గం ఎన్టీఆర్ ని టార్గెట్ చేసింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడే కాదు. తాత పేరుకు అతడు అనర్హుడు అంటూ ఏకిపారేశారు.
ఓ వర్గం కావాలని జూనియర్ ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేయిస్తుందని ఫ్యాన్స్ భావించారు. దాంతో జూనియర్ కి మద్దతుగా నిలిచి విమర్సలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టుకున్నారు. నేడు జరిగే ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం వేడుకకు జూనియర్ హాజరు కాని పక్షంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియా దాడి జరిగే అవకాశం కలదు.