NTR- Mokshagna
NTR- Mokshagna: తెలుగు సినీ,రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానం. అటు సినీ రంగంలో.. ఇటు రాజకీయ రంగంలో రాణించి.. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఆ కుటుంబం. ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టారు బాలకృష్ణ. ఇప్పుడు దానిని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కొనసాగిస్తున్నారు. త్వరలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్త గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో తాజాగా బయటకు వచ్చిన ఫోటో అటువంటి ప్రచారాలకు చెక్ చెబుతుంది.సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది.
ఇటీవల హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆమె కుమారుడు శ్రీ హర్ష వివాహం నాలుగు రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి వేదికగా మారింది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.మేనల్లుడి పెళ్లి కావడంతో నందమూరి వారసులంతా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ దంపతులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
బాలకృష్ణను చూసిన జూనియర్ ఎన్టీఆర్ పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. తారకరత్న మరణం సమయంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ను అవమానించారంటూ ఓ వీడియో హల్చల్ చేసింది. అయితే అది నిజం కాదని తాజా ఘటనతో తేలింది. ఇప్పుడు బాబాయ్, అబ్బాయిల ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అదే సమయంలో అన్నయ్యలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సందడిగా గడుపుతూ కనిపించారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. తామంతా ఒకటేనని సంకేతాలు ఇచ్చారు. తమ కుటుంబం పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ చెప్పారు.