Johnny Master : పైకి వెళ్లే కొద్దీ జానీ మాస్టర్ ని పరిస్థితులు క్రిందకు నెడుతున్నాయి. ఇది ఆయన పై ఇండస్ట్రీ లో కుట్రపూరితంగా ఏదైనా జరుగుతోందా?, లేదంటే ఆయన అదృష్టం అలా ఉందా అనేది అర్థం కావడం లేదు. తన అద్భుతమైన టాలెంట్ తో పాన్ ఇండియా లెవెల్ లో గొప్ప గుర్తింపు ని తెచ్చుకొని , తిరుగులేని కొరియోగ్రాఫహర్ గా ఎదుగుతూ , నేషనల్ అవార్డు ని కూడా అందుకునే స్థాయికి చేరుకున్నారు జానీ మాస్టర్. కానీ ఆయన పై కేసు నమోదై అరెస్ట్ అవ్వడం తో , నేషనల్ అవార్డు కూడా రద్దు అయ్యింది. ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న జానీ మాస్టర్, ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా జానీ మాస్టర్ కం బ్యాక్ ఇవ్వగలరని ఎవ్వరూ ఊహించలేరు.
ఆయన కెరీర్ ఇక అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో , మళ్లీ ఆయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. రీసెంట్ గా సూపర్ హిట్ గా నిల్చిన ‘పెద్ది’ చిత్రంలోని ప్రతీ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది , మరోసారి ఆయన టాలెంట్ కి నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది. ఇక జానీ మాస్టర్ కి తిరుగులేదని అంతా అనుకుంటున్నా సమయంలో రీసెంట్ గా జరిగిన ఫిలిం ఫెడరేషన్ గొడవలు ఆయన కొంప ముంచబోతున్నాయి. ఫెడరేషన్ లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని , నిర్మాతలు దగ్గర తీసుకుంటున్న డబ్బులు వేరు , డ్యాన్సర్స్ కి ఇచ్చే డబ్బులు వేరు, అందరినీ సస్పెండ్ చేసి ఫెడరేషన్ ని మూసేయాలని జానీ మాస్టర్ పెద్ద ఎత్తున తన వర్గం తో గొడవకు దిగారు. దీని పై శేఖర్ మాస్టర్ వర్గం కూడా స్పందించి , జానీ మాస్టర్ వర్గం తో గొడవపడ్డారు.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అయితే జానీ మాస్టర్ వ్యవహరించిన తీరుపై ఫెడరేషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆయన నిర్ధిష్ట సమయంలో బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే , చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కానీ జానీ మాస్టర్ అసలు స్పందించలేదు. దీంతో ఫెడరేషన్ మరోసారి జానీ మాస్టర్ కి హెచ్చరికలు జారీ చేసింది. క్షమాపణలు చెప్పకపోతే జానీ మాస్టర్ పని చేసే సినిమాల్లో , 23 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళు పని చేయకుండా బ్యాన్ ప్రకటిస్తామని నిర్మాతలకు సమాచారం అందించారు. కనీసం ఇప్పటికైనా జానీ మాస్టర్ రెస్పాన్స్ ఇస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ కి జానీ మాస్టర్ టాటా చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.
