CM Revanth Reddy Vs KCR: తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ ను మించిన రాజకీయ చాణక్యుడు లేడు అంటారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అటువంటి ఎత్తులే వేశారు. 2014, 2018, ఇంకా చాలా అంశాల్లో కేసీఆర్ వేసిన ఎత్తుగడలు భారత రాష్ట్ర సమితి తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి. ఆ వరుస విజయాలే కెసిఆర్ లో ఆత్మవిశ్వాసాన్ని కాస్త అతి విశ్వాసాన్ని పెంచాయని, అందువల్లే 2023 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. పైగా కేసీఆర్ వేసే ఎత్తుగడలు ఇప్పట్లో ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు. అందుకు ప్రతిగా వారు పాలమూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించిన ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు అతి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ పాలమూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మన్నే శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. వాస్తవానికి ఆయన గత కొంతకాలంగా ఆయన యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పోటీకి పెదగా ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ కెసిఆర్ ఆయన పేరును ప్రకటించడం విశేషం. పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఆయన తరఫున అతడి సోదరుడు మన్నే జీవన్ రెడ్డి రాజకీయాలు చేస్తుంటారు. దీనిపై కేసీఆర్ కు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ గతంలో పార్టీకి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆర్థిక సహాయం వల్ల ఆయన నోరు మెదపలేని పరిస్థితి.. పైగా జీవన్ రెడ్డికి ఈ ప్రాంతం మీద విపరీతమైన పట్టు ఉంది. పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు జై కొట్టే క్యాడర్ కూడా ఉంది. ఎలాగు జీవన్ రెడ్డి తెర వెనుక చూసుకుంటాడు కాబట్టి.. ఆ ధైర్యంతోనే కెసిఆర్ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించారని తెలుస్తోంది.
అసలే ముఖ్యమంత్రి, పైగా సొంత జిల్లా కావడంతో పాలమూరు పార్లమెంట్ స్థానంపై రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి శ్రీనివాసరెడ్డి కి, ఆయన పేరును ప్రకటించిన కేసీఆర్ కు స్కెచ్ వేసేలా రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి వెనుక ఉన్న జీవన్ రెడ్డిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు.. దీంతో ఒక్కసారిగా పాలమూరు రాజకీయాల్లో సంచలనం నమోదయింది. అటు భారత రాష్ట్ర సమితిలోనూ అదే పరిస్థితి. జీవన్ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలమూరు జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ సభలో రేవంత్ రెడ్డితో కలిసి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఇక 2021 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1445 ఓట్లు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి బీ ఫారం మీద గెలిచిన అభ్యర్థులు 1006 మంది ఉన్నారు. పలు కారణాలవల్ల అనర్హత వేటు గురైన వారు, మరణించిన వారిని మినహాయించగా 850 పై చిలుకు ప్రజాప్రతినిధులు భారత రాష్ట్ర సమితి పరిధిలో ఉన్నారు. వారంతా ఓటు వేస్తే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుస్తారు. కానీ కొంతకాలంగా రాష్ట్రంలో రాజకీయం మారినట్టే, పాలమూరు జిల్లాలో కూడా మారింది. పైగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతానికంటే ఎక్కువ బలాన్ని పెంచుకుంది. అందుకే ఈసారి అక్కడ భారత రాష్ట్ర సమితి గెలుస్తుందా? ఆ పార్టీ అసలు అభ్యర్థిని నిలబెడుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే మరి కొంతకాలం పడుతుంది. అన్నట్టు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో భారత రాష్ట్ర సమితి క్యాడర్ మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తోంది. దీంతో ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి తరుణంలో గులాబీ బాస్ ఎలాంటి ప్రయోగాలు చేస్తారనేది చూడాల్సి ఉంది.