అది 1991వ సంవత్సరం.. అప్పుడే ఓ కుర్ర డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనిపించుకుంటున్న రోజులు అవి, ఆ దర్శకుడే ‘ముత్యాల సుబ్బయ్య’. వరుసగా హాట్స్ ఇవ్వడం, పైగా ఒకే సంవత్సరంలో ‘ఎర్రమందారం’, ‘మామగారు’, ‘కలికాలం’ అంటూ మూడు హిట్స్ ఇవ్వడంతో ‘ముత్యాల సుబ్బయ్య’ రేంజ్ మారిపోయింది. అయితే ‘ఎర్రమందారం’, ‘కలికాలం’ సినిమాకు 1990లోనే సెన్సార్ పూర్తి అయింది. దాంతో ఆ రెండు సినిమాలను 1990లో నంది అవార్డుల కోసం పోటీ పడ్డాయి.
అయితే, ‘కళాసాగర్’ అనే అప్పటి ప్రముఖ కళాకారుల సంస్థ ప్రతి ఏటా ఇచ్చే సినిమా అవార్డులకు ఆ రోజుల్లో చాలా విలువ ఇచ్చేవారు నటీనటులు. అందుకు తగ్గట్టుగానే ప్రతిభావంతుల్ని గుర్తించి అవార్డ్ ఇచ్చి ప్రోత్సహించేవారు ఆ సంస్థ అధ్యక్షుడు ప్రముఖ నిర్మాత ‘ఎమ్మెస్ రెడ్డి’. సహజంగా ఎమ్మెస్ రెడ్డికి కాస్త కోపం ఎక్కువ.
ఆయన ఇచ్చే అవార్డు తీసుకోవడానికి ఎవరైనా రాకపోతే, ఆయన అది మనసులో పెట్టుకుని వారిని తన సినిమాల్లో మళ్ళీ పెట్టుకోరు. అందుకే ప్రతి నటి, అలాగే ప్రతి నటుడు ఎమ్మెస్ రెడ్డిగారు ఇచ్చే అవార్డులను తీసుకునేవారు. ఐతే ‘కలికాలం’ సినిమాలో జయసుధ కథానాయికగా నటించింది. కానీ, ఆమెకు ఉత్తమనటిగా కాకుండా ఉత్తమ సహాయనటిగా ఎమ్మెస్ రెడ్డిగారు అవార్డ్ ను ఇచ్చారు.
కానీ ఆ అవార్డు తీసుకోవడానికి జయసుధ వెళ్లలేదు. ‘కలికాలం’లో నేను హీరోయిన్ గా నటిస్తే, సపోర్టింగ్ యాక్ట్రస్ అవార్డ్ ఇవ్వడం ఏమిటి ? ఆయన నన్ను అవమాన పరచడానికే అలా అవార్డు ప్రకటించారు. అలాంటి అవార్డు నాకు అక్కర్లేదు అంటూ జయసుధ ఆ అవార్డ్ ను తిరస్కరించింది. దాంతో ఎమ్మెస్ రెడ్డికి కోపం కట్టలు తెచ్చుకుంది.
‘ఏమిటీ నా అవార్డునే జయసుధ తిరస్కరించి తప్పుపడుతుందా?’ అంటూ ఆయన ఆగ్రహించారు. ఆ కోపాన్ని ఆయన 1990 నంది అవార్డుల కమిటీకి ఛైర్మన్ అయిన తరువాత తీర్చుకున్నారు. కేవలం జయసుధ మీద కోపంతో ‘కలికాలం’ సినిమాను చూడకుండా పక్కన పెట్టేసి.. ఆ సినిమాకి ఎలాంటి అవార్డు రాకుండా తన పలుకుబడిని ఉపయోగించారట.
మొత్తానికి ఎమ్మెస్ రెడ్డి కోపానికి ఒక మంచి సినిమాకి ఎలాంటి అవార్డు రాలేదు. అయినా జయసుధ మీద కోపంతో సినిమాకి అన్యాయం చేయడం దారుణం అని అది తెలిసిన వాళ్ళు చాటుగా స్పందించినా ఎప్పుడూ ఎన్నడూ ఎవ్వరూ ఆయన దగ్గర ఆ విషయాన్ని అడిగే ధైర్యం చేయలేదు. జయసుధ కూడా ఆయన కనబడగానే కాళ్లకు నమస్కారం పెట్టేది కానీ, తన సినిమాకి చేసిన అన్యాయం గురించి ఆమె కూడా అడగలేదు.