Jaya Bachchan : పెళ్లంటే నూరేళ్లపంట అంటారు. పెళ్లి ద్వారానే ఇద్దరు మనుషులు పరిపూర్ణమైన జీవితం గడుపుతారు అంటారు. కానీ నేటి కాలంలో పెళ్లి అనేదానికి అర్థం మారిపోతోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గిపోతోంది. ఒకరి మీద మరొకరు పెత్తనం సాగించుకోవాలని తీరు పెరిగిపోతోంది. అందువల్లే పెళ్లిళ్లు కాస్త పెటాకులవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వివాహాలు చేసుకోకుండా అలా ఉండిపోతున్నారు. కొంతమందికేమో వివాహాలు చేసుకోవాలని ఉన్నప్పటికీ.. సరైన ఈడు జోడు దొరకక బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు.
దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు మరింత మంట పెట్టే విధంగా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది యువత పెళ్లిలు చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ వివాహాలు చేసుకున్నప్పటికీ పిల్లలను కనడానికి ఇష్టాన్ని ప్రదర్శించడం లేదు. ఉన్నంతవరకు స్వేచ్ఛగా బతకాలని.. జీవితాన్ని నచ్చిన విధంగా ఆస్వాదించాలని అనుకుంటున్నారు. డబ్బు సంపాదించడం.. సంపాదించిన డబ్బులను విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇటువంటి యువతలో మార్పు తీసుకురావడానికి జయ తన వంతు పాత్ర పోషించాలి. వివాహ క్రతువు గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా వివాహమే ఒక పనికిరాని వ్యవస్థ అని పనికిరాని వ్యవస్థ అని జయాబచ్చన్ వ్యాఖ్యానించడమే అసలైన దారుణం.
ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి జయా వెళ్లారు. ఆ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. “నేటి తరంలో వివాహం గురించి యువత పెద్దగా ఆలోచించడం లేదు. వివాహం గురించి కూడా వారికి పెద్ద కోరికలు లేవు. నా మనవరాలికి ఇదే చెప్తున్నాను. స్వేచ్ఛగా బతుకు.. స్వేచ్ఛగా ఉండాలని చెబుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉండాలి. శారీరక ఆకర్షణ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా పరస్పరం అర్థం చేసుకునే తత్వం ఉండాలి. మా తరంలో వివాహం వేరు. వివాహ వ్యవస్థ బలంగా ఉన్న తీరు వేరు. ఇప్పటి యువతరంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ప్రేమ వివాహాలను అంతగా అంగీకరించేవారు కాదు. ఇప్పుడు త్వరగానే ఆమోదిస్తున్నారు. ఇలాంటి మార్పులు ఇంకా చాలానే చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వివాహ వ్యవస్థకు అంత బలం ఎక్కడ ఉంటుందని” జయ వ్యాఖ్యానించారు.
జయ వ్యాఖ్యలు అలా ఉంటే.. ఇటీవల వాట్సప్ కు పోటీగా వచ్చిన అరట్టై ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ యాప్ సృష్టికర్త శ్రీధర్ వెంబు ఇటీవల వైవాహిక వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత 23 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవాలని.. ఆ తర్వాత పిల్లల్ని కనాలని సూచించారు. జీవితంలో 22 సంవత్సరాల లోపే సెటిల్ కావాలని సూచించారు. లేనిపక్షంలో అంతరాలు ఏర్పడతాయని.. ఆ తర్వాత అవి క్రమక్రమంగా కుటుంబం మీద.. సమాజం మీద ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. శ్రీధర్, జయ ఇద్దరు ప్రభావంతమైన వ్యక్తులే.. కానీ ఒకరేమో వివాహ వ్యవస్థ పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే.. మరొకరేమో సానుకూలంగా మాట్లాడారు. దీనిని బట్టి సమాజాన్ని జాగృతపరిచే వ్యక్తులు ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.