Actor Marimuthu Passed Away: కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు మారిముత్తు నేడు ఉదయం కన్నుమూశాడు. ఓ టీవీ షోకి మారిముత్తు డబ్బింగ్ చెప్పాల్సి ఉండగా ఆయన సన్నద్ధం అవుతున్నారు. అయితే సడన్ గా గుండెపోటుకు గురయ్యాడు. మారిముత్తు మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 56 ఏళ్ల మారిముత్తుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారిముత్తు హఠాన్మరణం చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్ర ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.
మారిముత్తుకు చిన్నప్పటి నుండి సినిమా అంటే మక్కువ. 1990లో ఇంటి నుండి పారిపోయి చెన్నై వచ్చాడు. గేయ రచయిత కావాలని మారిముత్తు దగ్గర సహాయకుడిగా కొన్నాళ్ళు పని చేశాడు. అనంతరం దర్శకత్వం వైపు వెళ్లారు. మణిరత్నం, ఎస్ జే సూర్య వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ గా చేశాడు.
2008లో కన్నుమ్ కన్నుమ్ చిత్రంతో డైరెక్టర్ అయ్యాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత 2014లో పులివాల్ టైటిల్ తో మరో చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పర్లేదు అనిపించుకుంది. నటుడిగా సక్సెస్ కావడంతో ఆయన యాక్టింగ్ పై దృష్టి పెట్టాడు. 100కు పైగా చిత్రాల్లో మారిముత్తు నటించాడు.
తాజా బ్లాక్ బస్టర్ జైలర్ మూవీలో మారిముత్తు కీలక రోల్ చేశారు. మెయిన్ విలన్ వినాయగన్ నమ్మినబంటు పాత్ర చేశాడు. నెక్స్ట్ ఆయన భారతీయుడు 2 చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. మారిముత్తు మరణంతో తమిళ పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయిందన్న మాట వినిపిస్తోంది.