Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ కనిపించని విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే సింహా, లెజెండ్ చిత్రాలతో సూపర్ కొట్టిన బోయపాటి.. మరోసారి బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి.
కాగా, నిన్న జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అదే జై బాలయ్య. అయితే, ఈ పాటతో బాలయ్య అభిమానులకు పాత రోజులు గుర్తొచ్చేలా చేసింది. థమన్ బీట్.. దానికి బాలయ్య వేసిన స్టెప్పులు.. టాప్ లేచిపోయేలా ఉన్నాయి. దీంతో సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సమరసింహా రెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య ఉత్సాహం ఈ సినిమాలో కనిపించిందని కొందరు అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే డిసెంబరు 2 వరకు ఎదురు చూడాల్సిందే.
ఈ సినిమా తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.