
అరివీర భయంకరమైన శత్రు సైన్యానికి ఒంటరిగా ఎదురు నిలిచే స్టార్లు.. కంటికి కనిపించని వైరస్ కు మరోసారి తలొగ్గుతున్నారు! చిత్ర పరిశ్రమకు ఇక, అంతా మంచి కాలమే.. అనుకున్న ఆనందం కాస్తా.. ‘మూణ్నెల్ల ముచ్చట’గా మారిపోయింది. సెకండ్ వేవ్ మహోగ్రరూపమై దూసుకొస్తున్న వేళ.. దేశం యావత్తూ మరోసారి నాలుగు గోడలకు పరిమితం అయ్యే పరిస్థితి వస్తుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో.. సినిమా రిలీజ్ లు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
దేశంలో ఒక రోజు నమోదైన కేసుల సంఖ్య లక్ష దాటింది. దీంతో.. కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించారు. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని అమలు చేసే దిశగా పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ లో థియేటర్లు తెరుచుకుని సరిగ్గా మూడు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పటి వరకూ భారీ చిత్రాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఏప్రిల్ నుంచే బడా స్టార్స్ బరిలోకి దిగబోతున్నారు. పవన్ వకీల్ సాబ్, చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ బిబి-3 వంటి చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్, యశ్ కేజీఎఫ్-2, అల్లు అర్జున్ పుష్ప, RRR వంటి సినిమాలు వరుసగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వెనక్కువెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ప్రకటించారు తెలంగాణ సీఎం. కానీ.. కరోనా వేగం చూస్తుంటే నిర్ణయాన్ని సమీక్షించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. పూర్తి లాక్ డౌన్ కాకపోయినా.. థియేటర్లలో 50 శాతం సీటింగ్ నిబంధనను మళ్లీ అమలు చేయొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. ఈ సినిమాలన్నీ ఖచ్చితంగ ఇబ్బందుల్లో పడతాయి.
దాదాపు వంద కోట్లకు ఇటూ అటుగా ఖర్చు చేసి నిర్మిస్తున్న సినిమాలను 50 శాతం సీటింగ్ తో రిలీజ్ చేస్తే.. నిర్మాతలకు భారీగా దెబ్బ పడుతుంది. అందుకే.. ఇలా రిలీజ్ చేసుకోవడం కన్నా.. వెనక్కి వెళ్లిపోవడమే మేలని భావిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఆచార్య వాయిదా పడనుందనే వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అదే జరిగితే మిగిలిన సినిమాలు కూడా ఆచార్యను అనుసరించవచ్చని అంటున్నారు. రోజురోజుకూ వేగంగా మారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.