Chiranjeevi Bro Daddy: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరుసగా సేఫ్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు అంటే వారిద్దరూ కూడా వరుసగా రీమేక్‌లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో సినిమాల ఫాస్ట్ మేకింగ్ కోసమే ఇలా రీమేకులకు వెళ్తున్నారు అనే టాక్ కూడా ఉంది. అయితే ఇలా చెయ్యడం మాత్రం ఇద్దరు స్టార్స్ అభిమానులను రంజింపజేయడం లేదు.
దానికి ముఖ్య కారణం ఇలా రీమేకులు చేసినప్పుడు హీరో స్టార్‌డం, నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు అనుకున్నంతగా కుదరడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ మరో రీమేక్ కోసం వెళుతున్నారనే పుకారు షికారు చేసింది.
అసలు విషయానికి వెళితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా కోసం సైన్ ఇన్ చేసారని, అది మలయాళ బ్లాక్ బస్టర్ ‘బ్రో డాడీ’కి రీమేక్ అని పుకార్లు వచ్చాయి. కీలక పాత్రల కోసం త్రిష, శర్వానంద్‌లు ఎంపికైనట్లు సమాచారం కూడా ఉంది. కానీ తాజా నివేదిక ప్రకారం, చిరు, కళ్యాణ్ కృష్ణల చిత్రం బ్రో డాడీకి రీమేక్ కాదంట. ప్రసన్న కుమార్ రాసిన తక్కువ బడ్జెట్ కథ అని తెలుస్తోంది.
చిరు ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను సవరించారని, ఆయన మాస్ అభిమానులను కూడా ఉర్రూతలూగించేలా అన్ని మసాలా దినుసులు జోడించారని అంటున్నారు.
ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ 2015లో వచ్చిన అజిత్ నటించిన వేదాళం చిత్రానికి రీమేక్. మరో ఆరు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. దానికి ముఖ్య కారణం కూడా ఈ సినిమా రీమేక్ చిత్రం కావడం. అందుకే మరోసారి చిరంజీవి ఆ తప్పు చేయకూడదు అని నిర్ణయించుకొని బ్రో డాడి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.
చిరంజీవి ఇటీవలి చిత్రాలు గాడ్ ఫాదర్, ఖైదీ నంబర్ 150 రీమేక్‌లు కాగా, పవన్ కళ్యాణ్ BRO, ఉస్తాద్ భగత్ సింగ్, భీమ్లా నాయక్, వకీల్ సాబ్, కాటమరాయుడు, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, తీన్ మార్ కూడా రీమేక్‌లే. మరి, చిరు నిజంగా బ్రో డాడీ రీమేక్‌కి వెళ్లడం లేదా అనేది అఫీషియల్ గా తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.