Vishwak Sen
Vishwak Sen : మన టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలు చేసే హీరోలు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కాలం లో స్టార్ హీరోలతో సమానంగా ఈ కుర్ర హీరోల సినిమాలకు వసూళ్లు వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే హీరో ఎవరు అనేది చూడకుండా, కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లతో పాటు, క్లోజింగ్ వసూళ్లను కూడా అందిస్తున్నారు జనాలు. కానీ హీరో విశ్వక్ సేన్ కి మాత్రం ఆ స్థాయి వసూళ్లు కానీ, గుర్తింపు కానీ రావడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, తన ప్రతీ కొత్త సినిమాతో ఆడియన్స్ ని ఎదో ఒక అంశంతో థ్రిల్ కి గురయ్యేలా చేయాలని తపన పడే హీరోలలో ఒకడు ఈయన. కానీ సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయి లో రావడం లేదు. గత ఏడాది ఈయన ‘గామీ’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ బాగానే వచ్చాయి.
కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఓపెనింగ్స్ విషయంలో విశ్వక్ సేన్ కెరీర్ లోనే నెంబర్ 1 గా నిల్చింది కానీ, క్లోజింగ్ మాత్రం 23 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోని ఈ చిత్రానికి ఓటీటీ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాలను జనాలు ఎందుకు ప్రోత్సహించరు అంటూ ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు. మెల్లగా ఈ చిత్రానికి ఆడియన్స్ కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని తెచ్చిపెట్టారు. ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని విశ్వక్ సేన్ ని ట్యాగ్ చేసి పోస్టులు కూడా పెట్టారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి మరో అరుదైన గౌరవం లభించింది. నెథర్లాండ్స్ లో జరుగుతున్న ‘ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రొట్టర్ డ్యాం’ లో మన సౌత్ నుండి ఎంపికైన సినిమాలలో మన టాలీవుడ్ నుండి ‘గామీ’ చిత్రం ఎంపికైంది.
ఇది విశ్వక్ సేన్ కి నిజంగా ఎంతో గర్వకారణం అనే చెప్పాలి. అతి తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ సినిమా తీసి, అంతర్జాతీయ స్థాయిలో ఆ చిత్రానికి గుర్తింపు తీసుకొని రావడమే కాకుండా, మన టాలీవుడ్ స్థాయిని కూడా పెంచేలా చేసినందుకు హీరో విశ్వక్ సేన్ ని ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు. దాదాపుగా ఆరేళ్ళ పాటు ఈ చిత్రాన్ని కష్టపడి పని చేసినందుకు దక్కాల్సిన అరుదైన గౌరవాలు ఇప్పుడు దక్కుతున్నాయి అంటూ మూవీ యూనిట్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇక విశ్వక్ సేన్ తదుపరి చిత్రం ‘లైలా’ అనే సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న మన ముందుకు రానుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ లో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసిన సంగతి తెలిసిందే.