Venu Thottempudi: గతంలో కొన్ని సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఆ తరువాత కనుమరుగయ్యారు. పెళ్లిళ్లు చేసుకుని విదేశాలకు వెళ్లేవారు. కానీ స్టార్ డం తెచ్చుకున్న కొందరు హీరోలు కూడా కనిపించకుండా పోతున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల నటనను కలిగిన వేణు తొట్టెంపూడి చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూడీ’ అనే సినిమాలో కనిపించాడు. అలాగే ‘అతిధి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వేణు ఎక్కడి వెళ్లారు? ఏం చేశారు? అనేది ఆసక్తిగా మారింది.
వేణు తొట్టెంపూడి 1976 జూన్ 4న జన్మించారు. ప్రకాశం జిల్లాలోని కొండపీడి మండలం పెరిదేపి ఆయన స్వగ్రామం. ఈయన మధురై లో ఇంటర్ పూర్తి చేసి కర్టాటకలోని ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తరువాత సినిమాలపై ఉన్న ఆసక్తితో భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన ఓ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఈ క్రమంలో విజయభాస్కర్ డైరెక్షన్లో 1999లో ‘స్వయంవరం’ అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది.
ఫస్ట్ మూవీనే సక్సెస్ కావడంతో వేణుకు ఆ తరువాత 2000లో ‘చిరునవ్వు’ సినిమా కూడా హిట్టు కొట్టడంతో ఆయన కెరీర్ టర్న్ అయింది. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు విజయవంతం అయ్యాయి. సినిమా హీరోగానే కాకుండా సహాయనటుడిగా, నిర్మాతగా పలు సినిమాలకు పనిచేశాడు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ తరువాత వేణు కే గుర్తింపు వచ్చింది. పలు ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
2013లో ‘రామాచారి’ అనే సినిమా తరువాత వేణు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సమయంలో వేణు అమెరికాలోని ఓ వ్యాపారంలోకి దిగాడు. అక్కడ బిజినెస్ చేస్తూ గడిపాడు. ఇలా 9 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా వేణు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ‘అతిధి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో వేణు మరోసారి ఫాంలోకి వస్తాడా? అనే చర్చ సాగుతోంది.