Tanikella Bharani: నటుడిగా తనికెళ్ల భరణి సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్నాడు. రచయితగా, దర్శకుడిగా కూడా రాణించారు. 1985లో విడుదలైన లేడీస్ టైలర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన తనికెళ్ళ భరణి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ తో పాపులర్ అయ్యాడు. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా విలన్, కమెడియన్ రోల్స్ చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.
తనికెళ్ళ భరణి తన బాల్యం ఎలా ఉండేదో, తండ్రితో ఆయన అనుబంధం ఎలాంటిదో గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న తనికెళ్ల భరణి గతం గుర్తు చేసుకున్నారు. ”ఏడో తరగతి వరకు కూడా నాకు చెప్పులు లేవు. ఒట్టి కాళ్లతో తిరిగే వాడిని. ఒకరోజు నాన్న చేత చెప్పులు కొనిపించుకోవాలని… కాల్చి పడేసిన సిగరెట్ మీద కాలేశాను. అమ్మా అని గట్టిగా అరిచాను. మానాన్న షాప్ కి తీసుకెళ్లి చెప్పులు కొనిస్తాడనుకుంటే… చూసుకుని కదా నడిచేది వెధవ అని తిట్టాడు.
ఏవైనా పెద్ద తప్పులు చేస్తే చెట్టుకు కట్టేసి కొట్టేవాడు. ఆయన జేబు నుండి రూపాయి రెండు రూపాయిలు కొట్టేస్తూ ఉండేవాడిని. ఒకరోజు వంద రూపాయలు తీసుకున్నాను. ఈ రోజు వాడికి పప్పు, నెయ్యి వేసి మంచి భోజనం పెట్టు. వాడికి మన ఇంట్లో ఇదే చివరి భోజనం. రేపటి నుండి ఎక్కడో జైల్లో తినాల్సి ఉంటుంది, అన్నాడు. వంద రూపాయలు తీస్తావా అని బాగా తిట్టారు.
నాకు సిగరెట్ అలవాటు ఉండేది. సిగరెట్ మానేసిన మా నాన్న ఓ రోజు నా జేబులో ఉన్న సిగరెట్ తీసుకుని తాగాడు. ఒక దశలో గంజాయి కూడా అలవాటు అయ్యింది. ఇంకా చాలా చెడు వ్యసనాల బారిన పడ్డాను. నాన్న బాగా కొట్టారు. నన్ను కొట్టినప్పటికీ తర్వాత ఆయనే బాధపడ్డారు. నేను పెద్దయ్యాక ఓ వెయ్యి రూపాయలు ఆయన జేబులో పెట్టేవాడిని. ఆయన ఎందుకు రా అనేవాడు. అప్పుడు తీసుకున్న వాటికి వడ్డీ అని సరదాగా చెప్పేవాడిని…” అంటూ తండ్రిని తలచుకుని తనికెళ్ళ భరణి ఎమోషనల్ అయ్యాడు.