Rajamouli: ప్రస్తుతం దేశంలోని నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు మెజారిటీ ప్రేక్షకుల నుంచి రాజమౌళి పేరు సమాధానంగా వినిపిస్తోంది. హిందీ ప్రేక్షకులు ఈ విషయాన్ని అంగీకరించకపోయినా రాజమౌళి స్థాయిలో విభిన్నమైన కథలతో విజయాలను అందుకున్న దర్శకులు లేరనే చెప్పాలి. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో రాజమౌళి దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారనే సంగతి తెలిసిందే. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి కాగా జక్కన్న కెరీర్ తొలినాళ్లలో శాంతి నివాసం సీరియల్ కు డైరెక్టర్ గా వ్యవహరించారు.
శాంతినివాసం సీరియల్ రాజమౌళికి దర్శకుడిగా మంచిపేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత స్టూడెంట్ నంబర్1 సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా ఆ సినిమా సక్సెస్ సాధించడం జరిగింది. స్టూడెంట్ నంబర్1 సక్సెస్ సాధించినా రెండేళ్ల ఎదురుచూపుల తర్వాతే రాజమౌళికి సింహాద్రి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే దక్కింది. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సాధించడంతో జక్కన్న క్రేజ్ మరింత పెరిగింది.
మగధీర, బాహుబలి1, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు రాజమౌళి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లుగా చేరాయి. మర్యాదరామన్న, ఈగ సినిమాల ద్వారా ప్రయోగాత్మక కథలతో కూడా విజయాలను సొంతం చేసుకుంటానని రాజమౌళి ప్రూవ్ చేశారు. రాజమౌళి మరెన్నో విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.