Sharathulu Varthisthai: తెలంగాణ.. పదేళ్ల క్రితం వరకు ఈ పదం అంటే మాస్ అన్నట్లు చిత్రీకరించారు. సినిమాల్లో తెలంగాణ వాసులు విలన్ పాత్రకే పనికొస్తారు, తెలంగాణ యాస, భాష విలన్లకే సూట్ అవుతుందన్నట్లు సినిమాలు తీశారు. కానీ, 2014 తర్వాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణ నటులు హీరోలు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆరిస్టులు అవుతున్నారు. తెలంగాణ సంస్కృతి, జీవన విధానాలపై సినిమాలు తీసి సక్సెస్ సాధిస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే ఆంధ్రా హీరోలు కూడా తెలంగాణ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన సినిమా దసరా, బలగం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల్లో తెలంగాణలోని రెండే వేర్వేలు అంశాలను తీసుకుని సినిమా తీశారు. బొగ్గు గనుల నేపథ్యంలో దసరా సినిమా వస్తే.. తెలంగాణలో అనుబంధాలను ప్రాతిపదికన తీసుకుని బలగం సినిమాను తెరకెక్కించారు. బలగంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పిట్ట ముట్టకుంటే ఎంత బాధపడతారు.. అనుబంధాలు చనిపోయిన తర్వాత కూడా ఎలా ముడిపడి ఉంటాయో చూపించారు. ఈలైన్ నచ్చిన తెలంగాణ పల్లెజనం సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇక దసరాలో మాత్రం తెలంగాణ కల్చర్ పెద్దగా కనిపించలేదు. మాటలు, పాటల్లో మాత్రమే కాస్త చూపించారు. అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే మద్యం తాగుడు. రెండు సినిమాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేపథ్యంలో తెరకెక్కినవే. ఒకగి గోదావరిఖని అయితే.. మరొకటి సిరిసిల్ల. ఇక పెళ్లి తంతును కథాంశంగా చేసుకుని ఫిదా సినిమా తెరకెక్కింది. అయితే తెలంగాణ పెళ్లి వేడుకను ఈ సినిమాలో ఓ అంశంగానే చూపించారు. ఇక ఆమధ్య వచ్చిన బుల్లెట్టు బండి పాట కూడా తెలంగాణ నేటివిటీని కళ్లకు కట్టింది.
ఒక్క పాటలో పెళ్లిని తెరకెక్కించిన అక్షరకుమార్..
తెలంగాణ కల్చర్ అంటే తాగుడు ఒక్కటే అన్నట్లుగా చూపించే తీరుపై విమర్శలు ఉన్నాయి. తెలంగాణ తాగడం ఉంది. అందులో మొహమాటం లేదు. అందరూ తాగుబోతులు కారు. తాగడానికీ ఓ పద్ధతి ఉంది… మర్యాదలు ఉటాయి. మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే.. గోదావరిఖనికి చెందన నూతన దర్శకుడు అక్షకకుమార్(కుమారస్వామి) దర్శకత్వం వహించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలోని పన్నెండు గుంజల పాట రెండు రోజుల క్రితం రిలీజైంది. తెలంగాణ పెళ్లి తంతు మొత్తాన్ని ఈ ఒక్కపాటలో కళ్లకు కట్టేలా చూపించాడు అక్షరకుమార్.
వినగానే లోపలికి తీసుకెళ్తుంది..
తెలంగాణ పాట అంటే ఏదో ఫోక్‌సాంగ్ అనుకుంటారు. కానీ, ఇది ఫోక్‌సాంగ్ కాదు వినడం మొదలు కాగానే, మన పాట, మన సంస్కృతి, మన సంప్రదాయం అన్నట్లుగా తెలియకుండానే మొత్తం పాటలోపలికి తీసుకెళ్తుంది. అంతలా హత్తుకునేలా దర్శకుడు పాట రాయించుకున్నాడు. పెద్దింటి అశోక్ ఈ పాట రాశాడు. పెళ్లి తంతును ఒక్క పాటలో చూపించడం మామూలు విషయం కాదు. కానీ, అక్షరకుమార్ ఆ విషయంలో డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాడు.
సింగర్ ఎంపిక కూడా..
పాటలో ఎంత మంచి లిరిక్స్ ఉన్నా.. ఎంత అందంగా తెరకెక్కించినా దానిని పాడే గొంతు కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలోనూ అక్షర కుమార్ షభాశ్ అనిపించుకున్నారు. పన్నెండు గుంజల పందిర్ల కింద అని పాడుకునే ఆ పాటకు కొత్త సింగర్‌ను ఎంచుకుని సక్సెస్ అయ్యాడు.
‘పచ్చాని పందిట్ల ముత్యాల పోలు..,
పాలాపొరుక తీసుడే.., కుండలు దీసి,
ముగ్గులు పూసి, ఐరేండ్లను జేసుడే…
ఒడిబియ్యం పోసుడే… సన్నబియ్యం
సాలుపోసి జోడు పీటలేసుడే…
మైలాపోలు తీసుడే… చెక్కరి కుడుకలు
పోసుడే… పోలు వోసిన… ఏడవకు
ఏడవకే నా ముద్దు బిడ్డా, నవ్వుతూ
దాటాలె పుట్టింటి గడ్డ’ వంటి వాక్యాలతో పెద్దింటి అశోక్ తెలంగాణ పెళ్లి తంతును చక్కగా రాశాడు.