Pallavi Prashanth: బుల్లితెరపై ఉర్రూతలూగించే బిగ్ బాస్ -7 సీజన్ ప్రారంభమైంది. ఇక ఇప్పటి నుంచి ఈ షో లవర్స్ టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉంది. గత ఆరు సీజన్లు ఉత్కంఠ భరితంగా సాగడంతో ప్రేక్షకులు ఆదరించారు. రోజూ టీవీ సీరియళ్లు చూసేవారు సైతం బిగ్ బాస్ షో కు కనెక్ట్ అయ్యారంటే మామూలు విషయం కాదు. బిగ్ బాస్ 7 సీజన్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైన ఈ ఈవెంట్ లో కంటెస్టెంట్ల పరిచయం చేశారు. ఈసారి ఎక్కువగా సినీ తారలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే కామన్ మ్యాన్ కేటగిరిలో ఓ యువ రైతు ను ఎంపిక చేశారు. అతని వివరాల్లోకి వెళితే..
ఈ రోజుల్లో ఏ రంగానికి చెందిన వారైతే తమ గురించి తెలుపుకుంటూ వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో పెడుతున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ అనే యువరైతు తాను చేస్తున్న వ్యవసాయం గురించి నిత్యం చెబుతూ వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇతని వీడియోలకు మెచ్చిన చాలా మంది అతన్ని ఫాలో అయ్యారు. అంతకంటే ముందు ఫోక్ సాంగ్స్ చేసిన ప్రశాంత్ ఆ తరువాత వ్యవసాయానికే పరిమితం అయ్యారు. అయితే ఎప్పటికైనా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలని అతని కోరిక. ఈ నేపథ్యంలో ఫేమస్ కావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు.
ఈ తరుణంలో అతను పెద్ద కష్టాన్ని ఎదుర్కొన్నాడు. తాను ఫోక్ సాంగ్స్ లో నటించిన తరువాత వచ్చిన డబ్బులను స్నేహితులే మోసం చేశారని ఆయన తన వీడియోల ద్వారా తెలిపాడు. అందుకే తాను ఎప్పటికైనా బిగ్ బాస్ షో లో అడుగుపెట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ప్రతీ వీడియోలో తనకు బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వాలని ప్రాథేయపడ్డాడు. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం అతని కోరిక మేరకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. దీంతో మిగతా కంటెస్టెంట్ల కంటే పల్లవి ప్రశాంత్ కు రెమ్యునరేషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది.
అనుకున్నట్లే బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వచ్చిన తరువాత పల్లవి ప్రశాంత్ ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఈవెంట్ వేదికపైకి వినూత్నంగా వడ్ల బస్తా తో వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం చేయాలనుకుంటే ఒకరి కింద బతకాలి. కానీ ఇక్కడ పనిచేస్తే నలుగురి కడుపు నిండుతుంది… అందుకే నేనే వ్యవసాయాన్ని ఎంచుకున్నా.. అని పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అవుతూ తన పర్సనల్ విషయాలను టీవీ ప్రేక్షకులతో పంచుకున్నాడు.