అంత గొప్ప క్రమశిక్షణతో నిత్య విద్యార్థిలా కృష్ణ ప్రవర్తన ఉండేది. అందుకే కృష్ణ ఇంతవరకు ఏ దర్శకుడితోనూ గొడవ పడలేదు. పైగా సమయానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఉదయం తొమ్మిది గంటలకు సెట్ లో ఉండాలి అంటే.. మేకప్ తో రెడీ అయి పది నిముషాలు ముందే సెట్ కి వచ్చేవారు. ఎన్టీఆర్ తర్వాత అంత హార్డ్ వర్క్ హీరో ఒక్క కృష్ణ మాత్రమే.
నైట్ షూటింగ్స్ కు కూడా కృష్ణ పెట్టింది పేరు. అర్ధరాత్రి అయినా ఆయన ఎప్పుడూ షూటింగ్ అభ్యంతరం చెప్పేలేదు. అలాగే సెట్ లో దర్శకుడు ఒక సీన్ కోసం ఏమి చేయమని కోరినా.. ‘అది చేయను, ఇది చెయ్యను’’ అంటూ కృష్ణ నోటి వెంట ఎప్పుడు రాలేదు. అయితే, ఓ దర్శకుడితో మాత్రం కృష్ణకు పెద్ద గొడవ జరిగింది.
ఒక విధంగా కృష్ణ ఆ దర్శకుడి పై చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. గొడవకు కారణం.. దర్శకుడు నిర్మాత పై అధిక భారం మోపడం. చెప్పిన సమయానికి షూటింగ్ ను పూర్తి చేయకపోగా, నిర్మాతకు సరైన విలువ ఇవ్వకపోవడంతో కృష్ణ ఆ దర్శకుడి అప్పటికే చికాకుగా ఉన్నారు. కృష్ణ ఎప్పుడు నిర్మాతల హీరో. తన నిర్మాత టెన్షన్ తో భయపడుతున్నాడు అంటే ఆయన చూస్తూ ఉండలేరు.
ఆ రోజు సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. ఆ షూట్ లో కృష్ణతో పాటు హీరోయిన్ జయప్రద (Jayaprada) కూడా ఉంది. ఆమెకు వేరే సినిమా షూట్ ఉంది కాబట్టి, కృష్ణ సినిమాకి ఆమె ఒకరోజు కాల్షీట్ మాత్రమే ఇచ్చింది. ఆ రోజు ఆమె పార్ట్ కి సంబంధించిన షూట్ మొత్తం పూర్తి చేయాలి. కానీ దర్శకుడు మాత్రం ఆమె పార్ట్ ను షూట్ చేయకుండా టైం వృధా చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
నిర్మాత ఆందోళనలో ఉన్నాడు. మళ్ళీ జయప్రదను మరో రోజు షూటింగ్ బుక్ చేస్తే బడ్జెట్ పెరుగుతుంది. ఇప్పటికే సినిమాకి అదనపు బడ్జెట్ అయింది. కానీ ఈ విషయం బయటకు చెబితే సినిమాకి నష్టం జరుగుతుంది ఏమో అని లోలోపలే నలిగిపోతున్నాడు. అది గమనించి కృష్ణ, ఆ డైరెక్టర్ పై సీరియస్ అయి.. ముందుగా జయప్రద సీన్స్ ను ఆయనే స్వయంగా షూట్ చేసి.. ఒక్కరోజులోనే జయప్రద పార్ట్ షూట్ ను పూర్తి చేసేశారు. కృష్ణలో ఒక దర్శకుడు కూడా ఉన్నాడు.