Junior NTR: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం కూడా అలాంటిదే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుల్లో ఒకడిగిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్, తానేమిటో నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పసిప్రాయంలోనే పౌరాణిక పాత్ర చేసిన దిట్ట ఎన్టీఆర్. టీనేజ్ దాటకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చి అద్భుతాలు చేశారు. ఎన్టీఆర్ మొదటి ప్రయత్నం విఫలం. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన నిన్ను చూడాలని ప్రేక్షకులను మెప్పించలేదు. ఎన్టీఆర్ వారసుడిగా ఆయన రూపు రేఖలతో పుట్టినవాడిగా జూనియర్ ని ప్రమోట్ చేశారు.

తన అసలైన టాలెంట్ భయపడింది స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో. ఆ మూవీలో ఎన్టీఆర్ నటన అద్భుతం, డాన్సులు నభూతో నభవిష్యతి. చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ గా అవతరించారు. క్లాసికల్ డాన్సర్ అయిన ఎన్టీఆర్ కి డాన్స్ చేయడం అలవోకగా మారింది. అందులోనూ ఏక సంధాగ్రాహి కావడంతో ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండానే స్టెప్ వేయగల దిట్ట. ఎన్టీఆర్ కెరీర్ కి మెరుపు వేగంతో చేసే డాన్స్ ఉపయోగపడింది.
హీరోగా మూడో చిత్రం సుబ్బు మ్యూజికల్ హిట్. ఇక ఆది తో ఎన్టీఆర్ చేసిన సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. ఆదికేశవరెడ్డిగా చిన్న వయసులో మీసం తిప్పినా, కత్తి పట్టినా ప్రేక్షకులు అంగీకరించారు.”అమ్మతోడు అడ్డంగా నరికేస్తా” ఈ డైలాగ్ పిచ్చ ఫేమస్. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఆది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ కి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. రాజమౌళితో రెండో సినిమా సింహాద్రి మరో ప్రభంజనం సృష్టించింది. ఎన్టీఆర్ కి సింహాద్రి ఏడో మూవీ కాగా రాజమౌళికి రెండో చిత్రం. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన సింహాద్రి ఎన్టీఆర్ ని స్టార్ హీరోల లిస్ట్ లో చేర్చింది.

నూనూగు మీసాల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యారు. బీభత్సమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే సింహాద్రి విజయం ఎన్టీఆర్ తర్వాత చిత్రాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఎన్టీఆర్ పై అంచనాలు పెరిగిపోవడంతో ప్రేక్షకులకు ఆయన చిత్రాలు నచ్చేవి కావు. సింహాద్రి తర్వాత వెంటనే చేసిన ఆంధ్రావాలా మూవీపై అంతులేని అంచనాలు ఏర్పడ్డాయి. అనూహ్యంగా ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.
కొన్నేళ్ల పాటు ఎన్టీఆర్ కి బ్యాడ్ టైం నడిచింది. సరైన హిట్ పడలేదు. ఆ సమయంలో హిట్ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యింది. ఎన్టీఆర్ కి ఫస్ట్ హిట్, ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళి యమదొంగ చిత్రం చేశారు. రాఖీ చిత్రం నాటికి ఎన్టీఆర్ బరువు పెరిగి పూర్తిగా షేప్ అవుట్ అయ్యారు. రాజమౌళి బరువు తగ్గాలని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. దాంతో ఎన్టీఆర్ సగానికి పైగా సన్నబడ్డారు. ప్రేక్షకుల అంచనాలు తప్పకుండా యమదొంగ సూపర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది.
తనని తాను మార్చుకుంటూ మెరుగు పరుచుకుంటూ అభిమానుల ఆశలు నెరవేరుస్తూ ఎన్టీఆర్ అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు. 22 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యారు. హాలీవుడ్ ప్రేక్షకులు, పత్రికలు ప్రస్తావించే స్థాయికి ఎదిగారు. వారసత్వం ఉంటే సరిపోదు టాలెంట్ మాత్రమే హీరోగా నిలబెడుతుంది నిరూపించిన స్టార్ ఎన్టీఆర్.