Naresh: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అలియాస్ ‘మా’. నిజానికి ఈ అసోసియేషన్ లో గట్టిగా వేయిమంది కూడా మెంబర్లుగా లేరు. మరి ఎందుకు ఈ అసోసియేషన్ ఎన్నికల పై ఇంత క్రేజ్ ?. సరే ఈ క్రేజ్ ఇమేజ్ పక్కన పెడితే.. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచినా రూపాయి కూడా ఇవ్వరు. పైగా జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. అయినా ప్రతి ఎలక్షన్స్ కి తిట్లు వెన్నుపోట్లు సహజం అయిపోయాయి.

దాంతో ‘మా’ మసకబారింది. తాజాగా సీనియర్ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అనేక విమర్శలు చేసుకుంటూ పోయారు. నరేష్ మాటల్లో.. ‘మా’లో నేను ఇరవై ఏళ్లు ఒక సాధారణ సభ్యుడిగా ఉన్నాను. అయితే జయసుధ గారు పోటీ చేసే సమయంలో నన్ను వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని గురువుగారు దాసరి నారాయణరావు కోరారు. అందుకే నేను పోటీ చేశాను.
జాయింట్ సెక్రటరీగా గెలిచాను కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల కారణంగా వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ కూడా అయ్యాను. నేను ఏమి చేయలేదు అని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎందరో నటులకు నేను సినిమా ఛాన్స్ లు ఇప్పించాను. సినిమా వాళ్ళ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది’ అని నరేష్ చెప్పుకొచ్చారు.
మరి నరేష్ ఇన్ని గొప్ప పనులు చేస్తే.. మరెందుకు ఆయన పై విమర్శలు వచ్చాయి ? ఇదే విషయం పై నరేష్ స్పందిస్తూ.. కరోనా సమయంలో ‘మా’లో కొన్ని విబేధాలు వచ్చాయి. దాంతో రెండు గ్రూపులు విడిపోయాము. రెండో గ్రూప్ మీడియా వద్దకి వెళ్లి మమ్మల్ని నిందిస్తూ కొన్ని ఇబ్బందికర కామెంట్స్ చేశారు. అందరూ అవే నిజాలు అనుకున్నారు. ‘మా’ అధ్యక్షుడిగా నేను సంక్షేమ పథకాలు తీసుకొచ్చాను’ అంటూ నరేష్ స్పీచ్ సాగింది.
మరి నిజంగానే నరేష్ అన్ని మంచి పనులు చేస్తే.. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ‘మా’లో అనేక విమర్శలు వస్తున్నాయి ? పోనీ, నరేష్ చేసిన మంచి పనుల గురించి ఆయన ఎందుకు వివరంగా చెప్పడం లేదు ? అంటే.. ఆ పనులేమిటో నరేష్ కే తెలియదా ? ‘మా’ వైభవం కోల్పోతుంది అంటూ నరేష్ బాధ పడుతున్నారు గాని.. ‘మా’ తన వైభవాన్ని ఎప్పుడో కోల్పోయింది.