Indraja: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మంచి నటి. నటనలో ఆమె చూపించే పరిపక్వత, పాత్రలపై ఆమెకున్న మమకారం చాలా గొప్పవి. కానీ, ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. దాంతో రావాల్సినంతగా ఆమెకు గొప్ప పేరు రాలేదు. అయితే, వెండితెర పై అద్భుతాలు చేయలేకపోయిన ఇంద్రజ, ప్రస్తుతం బుల్లితెర పై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా ఇంద్రజ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అనేక సంగతులు చెప్పింది. ఆ విశేషాలు మీ కోసం.
నాకు సంగీతం పై , నృత్యం పై మంచి అభిరుచి మా అమ్మతోనే వచ్చింది. అమ్మ వల్లే నేను భరతనాట్యం .. తంగం మేడమ్ వద్ద, కూచిపూడి.. ఎమ్‌వీఎన్ మూర్తి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత సినిమా అవకాశాలెలా వస్తాయి ? అని ఆలోచించేదాన్ని. అమ్మే నన్ను ‘జంతర్ మంతర్’ టీమ్ కి పరిచయం చేసింది. మా అమ్మ నాకు ఛాన్స్ లు రావడం కోసం చాలా కష్టపడింది. ‘జంతర్ మంతర్’ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎస్వీ కృష్ణారెడ్డిగారు నన్ను ‘యమలీల’కు ఎంపిక చేశారు.
ఆ సినిమా రిలీజ్ తర్వాత.. నేను రెండేళ్లలోనే 30కి పైగా సినిమాలు చేశాను. ‘యమలీల’ బ్లాక్‌బ్లస్టర్ కావడంతో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. సక్సెస్‌లు ఎక్కువగా ఉండటంతో లక్కీ హీరోయిన్ అని పిలిచారు. ఈ క్రమంలోనే నేను కృష్ణ, బాలయ్య, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేశాను. ఐతే, నాకు రాజేంద్రప్రసాద్ ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనకు అన్ని క్రాఫ్ట్‌లు బాగా తెలుసు. అందుకే ఆయనను దర్శకత్వం చేయాలని కోరాను.
రాజేంద్రప్రసాద్ ఎప్పటికైనా చేస్తారనే నమ్మకం ఉంది. నా తమిళ సినిమాల గురించి చెప్పాలి అంటే .. నేను తెలుగులో చేస్తున్నపుడే.. నాకు తమిళంలో కొన్ని అవకాశాలు వచ్చాయి. మూడు, నాలుగు సినిమాలు చేశాను. ఆ తర్వాత గ్లామర్ పాత్రలకు కాకుండా నటనకు అవకాశం ఉండే పాత్రల వైపు వెళ్లాను. నిండుగా దుస్తులు వేసుకునేలా ఉండే పాత్రలు చేయాలనుకున్నాను. అలాగే చేశాను. ఆ సమయంలోనే ఛాన్స్ లు తగ్గిపోయాయి.
అయితే, అదే సమయంలో నాకు మలయాళంలో ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్‌గోపి, జయరాం లాంటి హీరోలతో కలిసి ఈపని చేశాను. కానీ, ‘సొగసు చూడ తరమా’ సినిమా మాత్రం నాకు బాగా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఒక ఆర్టిస్టుకు ఇలాంటి పాత్ర చేసినప్పుడే సంతృప్తి లభిస్తుంది. నా ఫేవరేట్ మూవీ ఇది. ఫొటోగ్రఫీ అద్భుతం.
ఇక స్పెషల్ సాంగ్స్ చేయడంతోనే ప్రధాన హీరోయిన్‌గా నాకు అవకాశాలు రాలేదు. నిజానికి పెద్ద బ్యానర్ అడిగినప్పుడు చేయకపోతే బాగుండదు. అందుకే, ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు చేస్తాం. ఇప్పుడు ఏదీ మాట్లాడినా లేనిపోని వివాదాలు అవుతాయి అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది.