కరోనా మహమ్మారి ఇంకా వదిలిపెట్టలేదు. అయినా భారీ సినిమాలు ధైర్యం చేసి రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. మరోపక్క దేశంలో రోజురోజుకు మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే, ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి చాలా విచిత్రంగానే ఉంది.
నిజానికి మహారాష్ట్ర దేశంలో అత్యధికంగా వ్యాక్సిన్లు తీసుకున్న రాష్ట్రం. ఇక కేరళ విషయానికి వస్తే.. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్నా వ్యాక్సినేషన్ రేట్ కేరళ ముందు ప్లేస్ లో ఉంది. అయినా, కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఇప్పట్లో అంగీకరించేలా లేదు.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం అక్టోబర్ వరకు అక్కడ ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లకు అనుమతి లేనట్లే. ఇక కేరళలో అయితే ఇప్పటివరకు అసలు థియేటర్లనే ఓపెన్ చేయలేదు. అనుమతి ఇవ్వం అని అక్కడి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంటే.. కేరళలో నవంబర్ వరకు థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు. మరి పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏమిటి ?
హిందీ వర్షన్ కి, మలయాళం వర్షన్ కి థియేటర్లు అందుబాటులో లేకపోతే ఇక అది పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుంది ? ముఖ్యంగా భారీ పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్” విడుదల అక్టోబర్ 13న ఉంటుంది అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే.. ఆర్ఆర్ఆర్ విడుదల సందేహంగా మారింది. “ఆర్ఆర్ఆర్”కి అన్ని రాష్ట్రాల మార్కెట్ కావాలి.
ఏ రాష్ట్రం మార్కెట్ మిస్ అయినా ఆర్ఆర్ఆర్ నష్టమే. అయినా కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ లో థియేటర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి.. జనం ముందు థియేటర్స్ కి రావడానికి అలవాటు పడాలి. సో.. ముందు ప్రకటించిన అక్టోబర్ 13 నాడే ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయడం సినిమాకి ప్లస్ కన్నా.. మైనసే ఎక్కువ.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీస్టారర్ కి ఓపెనింగ్స్ కీలకం. మరి రాజమౌళి తన సినిమా విడుదల పై ఏ నిర్ణయం తీసుకుంటాడో ?