Allu Aravind- Lavanya Tripathi: కొందరు తెలిసి అంటారో తెలియక అంటారో తెలియదు కానీ అవి కచ్చితంగా జరుగుతాయి. లావణ్య-వరుణ్ తేజ్ ల పెళ్లి గురించి నిర్మాత అల్లు అరవింద్ రెండేళ్ల క్రితమే హింట్ ఇచ్చాడనే వాదన మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 2021లో లావణ్య త్రిపాఠి-కార్తీకేయ జంటగా చావు కబురు చల్లగా చిత్రం చేశారు. ఇది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అరవింద్ హాజరయ్యారు. వేదిక మీద మాట్లాడుతున్న లావణ్య చేతిలో మైక్ లాక్కొని ఆయన ఒక మాటన్నారు.
నార్త్ అమ్మాయి అయినప్పటికీ నేర్చుకొని తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ఇక్కడే ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది… అని అల్లు అరవింద్ అన్నారు. ఆ మాటకు లావణ్య గట్టిగా నవ్వేసింది. కట్ చేస్తే రెండేళ్లలో లావణ్య ఆయన కుటుంబంలోకే కోడలిగా పోయింది. బావమరిది నాగబాబు ఇంటి కోడలు అయ్యింది. అల్లు అరవింద్ ఈ మాటలు అనే నాటికే లావణ్య-వరుణ్ తేజ్ లవ్ లో ఉన్నారు. అయితే బయటకు తెలియదు.
ఒకవేళ అల్లు అరవింద్ కి తెలిసే ఇలా హింట్ ఇచ్చాడా? లేక ఆయన ఏదో మాటవరసకి అన్న మాట నిజమైందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పటి అల్లు అరవింద్, లావణ్యల వీడియో వైరల్ అవుతుంది. లావణ్య-వరుణ్ 2017లో మిస్టర్ మూవీ చేశారు. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది. అది మెల్లగా పెరిగి ఘాడంగా మారింది. కొన్నాళ్లుగా లావణ్యతో వరుణ్ రిలేషన్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. లావణ్య ఈ వార్తలను ఖండించడం విశేషం.
జూన్ 9న హైదరాబాద్ మణికొండలో గల నాగబాబు నివాసంలో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్… ఇలా మెగా హీరోలందరూ కొలువుదీరారు. పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదని సమాచారం. ఈ ఏడాది చివర్లో వరుణ్-లావణ్యల వివాహం జరగనుంది.