
Deva Katta- Manchu Vishnu: ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన డైరెక్టర్ దేవా కట్టా. ఆయన తెరకెక్కించిన ప్రస్థానం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. శర్వానంద్, సందీప్ కిషన్ హీరోలుగా నటించారు. పొలిటికల్ థ్రిల్లర్ ప్రస్థానం అనేక అవార్డులు అందుకుంది. ప్రస్థానం అనంతరం దేవా కట్టా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. పలువురు నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపారు. అనూహ్యంగా దేవా కట్టా తన మార్క్ కంటిన్యూ చేయలేకపోయారు.
నాగ చైతన్య హీరోగా ఆటోనగర్ సూర్య టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఆటోనగర్ సూర్య డిజాస్టర్ అయ్యింది. హీరో మంచు విష్ణుతో డైనమైట్ చేశారు. ఆటోనగర్ సూర్య రిజల్ట్ రిపీట్ అయ్యింది.తనకు పేరు తెచ్చిన ప్రస్థానం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. అది కూడా ఆడలేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా విడుదలైన రిపబ్లిక్ పర్లేదు అనిపించుకుంది. డబ్బులు మాత్రం రాలేదు. సంచలనాలు చేస్తారనుకున్న డైరెక్టర్ దేవా కట్టా ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు.
దేవా కట్టా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డైనమైట్, ప్రస్థానం (హిందీ) చిత్రాలు ఎందుకు చేశానా అని బాధపడ్తానని చెప్పారు. నిజానికి డైనమైట్ చిత్రానికి నేను పని చేయలేదు. ఒక తొమ్మిది రోజులు మాత్రమే వర్క్ చేసి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. మంచు విష్ణు మాత్రం డైరెక్టర్ గా నాకు క్రెడిట్ ఇచ్చారు. అది తమిళ సినిమా రీమేక్. నాకు రీమేక్స్ ఓన్ చేసుకోవడం రాదు. తప్పు జరుగుతుందని తెలిసి కంటిన్యూ అవడం చాలా తప్పు.

చివరికి నా సొంత చిత్రం ప్రస్థానం హిందీ రీమేక్ కి కూడా నేను న్యాయం చేయలేకపోయాను. డైనమైట్, ప్రస్థానం (హిందీ) చిత్రాలు చేయకుండా ఉంటే బాగుండేదని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆ చిత్రాల విషయంలో బాధపడుతూ ఉంటానని… దేవా కట్టా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంద్ర ప్రస్థానం అనే మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. మరో మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు సమాచారం.