షూటింగ్స్ జరిగితే గానీ సినీ కార్మికులకు డబ్బులు వచ్చే అవకాశాలు లేవు. మరి, రోజువారీ వేతనాలతో బ్రతికే సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు తీరేది ఎలా ? గత ఏడాది కరోనా సమయంలో ఇలాంటి వారికీ సహాయం చేయడం కోసమని సినీ పెద్దలు కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం అందించారు. స్టార్లు కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఫండ్స్ ను విరాళాలుగా ప్రకటించి పేద కళాకారులను ఆదుకున్నారు.
మరి ప్రస్తుతం కూడా లాక్ డౌన్ ఉంది. అలాగే రాబోయే మూడు నెలలు కూడా షూటింగ్స్ పూర్తి స్థాయిలో జరుగుతాయని నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్లే ఆదుకోవాలి. సినిమాకి ఏభై నలభై కోట్లు తీసుకునే హీరోలు, సీసీసీ తరుపున సినీ కార్మికులకు కనీసం సరుకులు అయినా పంచి పెట్టాలి. మరి స్టార్ హీరోలు తలా పది లక్షలు ఇచ్చినా.. సినీ కార్మికుల కష్టాలు తీరతాయి.
గత కరోనా సీజన్ లో ఎలా అయితే, మెగాస్టార్ చిరంజీవి ముందుగా ఇనిషియేటివ్ తీసుకున్నారో.. ఈసారి కూడా మెగాస్టారే ముందుకు రావాలి. చిరంజీవి పెద్ద మనసుతో ముందుకు వస్తే.. మిగతా హీరోలు కూడా ముందుకొచ్చి సాయం చేస్తారు. రాబోయే మూడు నెలలు కార్మికులకు కఠిన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కాబట్టి.. హీరోలూ నిజమైన హీరోలు అనిపించుకోండి.