Naga Shaurya : 90లలో లతాశ్రీ పాప్యులర్ యాక్ట్రెస్ లలో ఒకరు. ఆమె పెద్ద హీరోయిన్ కాకపోయినా సపోర్టింగ్ రోల్స్ లో రాణించారు. సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలు కూడా చేశారు. యమలీల, అల్లరి పిల్ల వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో లతాశ్రీ 80కి పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా ఆమె 2007లో విడుదలైన అత్తిలి సత్తిబాబు మూవీలో నటించారు. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ హీరో. చాలా కాలం తర్వాత లతాశ్రీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
లతాశ్రీకి హీరో నాగశౌర్య మేనల్లుడు అవుతాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ విషయం చెప్పుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. దీని గురించి తక్కువ మాట్లాడితే బెటర్ అన్నారు. నాగ శౌర్య కుటుంబంతో ఆమెకు మనస్పర్థలు ఉన్నాయని లతాశ్రీ నేరుగా ఒప్పుకున్నారు. నేను నాగశౌర్యకు మేనత్తను అవుతాను నిజమే. కానీ నాగశౌర్య నా గురించి చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. మాకు పరిశ్రమలో ఎవరూ లేరని వాళ్ళు చెప్పుకుంటుంటే నేను మేనత్తనని ఎలా చెప్తాను. ఆ అవసరం నాకు లేదని లతాశ్రీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
నాకంటూ పరిశ్రమలో ఒక గుర్తింపు ఉంది. వాళ్ళ వలన కొత్తగా ఫోకస్ లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. నాకు మా అన్నయ్య అంటే ఇష్టం ఉంది. ఆయన కొడుకు నాగశౌర్య అన్నా కూడా ఇష్టం ఉంది. అన్నయ్య మనవాడు అవుతాడు కానీ వదిన కాదు కదా, అని లతాశ్రీ ఉన్న విషయం బయటపెట్టారు. నాగ శౌర్య తల్లి ఉషా ప్రసాద్ కారణంగా కుటుంబాల మధ్య దూరం పెరిగినట్లు చెప్పకనే చెప్పారు. వదినతో మనస్పర్థలు ఉన్నాయని వెల్లడించారు. నాగ శౌర్య సినిమాలు చూస్తారా అని యాంకర్ అడగ్గా… ఎప్పుడో అమ్మ ఉన్నప్పుడు ఊహలు గుసగుసలాడే చిత్రం చూశాను. నేను నాగ శౌర్య సినిమాలు చూసేది తక్కువే అని ఒప్పుకున్నారు.
నాగశౌర్య తండ్రి శేఖర్ ప్రసాద్.. లతాశ్రీకి సొంత అన్నయ్య అట. నిజంగా ఈ విషయం పరిశ్రమ వర్గాలు తప్పితే సాధారణ జనాలకు తెలియదు. నాగశౌర్య ఎవరి సప్పోర్ట్ లేకుండా పరిశ్రమకు వచ్చినట్టు చెబుతుంటారు. లతాశ్రీ మాటలు పరిశీలిస్తే నాగశౌర్యను హీరోగా పరిచయం చేయడంలో లతాశ్రీ హ్యాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. నాగశౌర్యకు ఛలో చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో సూపర్ హిట్ కొట్టింది. మరలా నాగశౌర్యకు ఆ రేంజ్ హిట్ పడలేదు. నాగశౌర్య తల్లి ఉషా ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు.