Harish Shankar: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో అత్యాచారం, ఆపై హత్యకు గురైన ఆరేళ్ల బాలికకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ చాలా మంది ఈ బాలికకు న్యాయం చేయాలని.. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పుడు సినీ సెలబ్రెటీలను కూడా కదిలిస్తుండడం గమనార్హం.
ప్రముఖ దర్శకుడు, ఫైర్ బ్రాండ్ అయిన ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) ఇటీవల పలు వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. సాయిధరమ్ తేజ్ పై మీడియా అత్యుత్సాహాన్ని హరీశ్ ఇటీవల ఎండగట్టి ఓ సీనియర్ జర్నలిస్టుతో ఫైట్ చేశాడు.
తాజాగా హైదరాబాద్ లో దారుణహత్యకు గురైన ఆరేళ్ల బాలికకు న్యాయం చేసేందుకు ‘సజ్జనార్ మళ్లీ రావాల్సిందేననే’ ఉద్యమాన్ని డైరెక్టర్ హరీశ్ శంకర్ చేపట్టారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసు పరిష్కరించేందుకు సజ్జనార్ సర్ రావాలి. తక్షణ న్యాయం అవసరం. లేకపోతే ఇది ఆగదు. కానీ ఈ వార్తలు వ్యాప్తి చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి వార్తల ద్వారా స్ఫూర్తి పొందే దిక్కుమాలిన మనుషులున్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్(KTR) వరకూ చేరుతుందని ఆశిస్తున్నా’ అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. అటు సజ్జనార్(Sajjanaar)ను తీసుకురావాలని మంత్రి కేటీఆర్ ను కోరుతూ హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఇప్పుడు హరీశ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. హత్యాచారం చేసిన వారిని ఎన్ కౌంటర్ చేయాలని.. సజ్జనార్ రావాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ ట్వీట్ కు సపోర్టుగా కామెంట్లు, షేర్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.
We need Sajjanaar sir to handle this .. Instant justice is Needed or else it won’t stop and don’t wanna spread this news as there is a danger of other perverted minds to get inspired through the news !!! Frustrated and helpless ….matter reached to @KTRTRS let’s hope the best https://t.co/q8EsBp4fgH
— Harish Shankar .S (@harish2you) September 13, 2021