దర్శకుడు మెహర్ రమేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘వేదాళం’ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అందుకే మొదటి నుండి ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? అంటూ అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.
మొదట ఈ పాత్రలో సాయి పల్లవిని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత కీర్తి సురేష్ నటిస్తోంది అంటూ రూమర్స్ వచ్చాయి. మెగాస్టార్ సిస్టర్ గా కీర్తి సురేష్ అయితేనే బాగుంటుందని మెగా టీమ్ కూడా భావించింది. చిరుకి చెల్లిగా నటించడానికి ఆమెను ఒప్పించారు. మొత్తానికి ‘మహానటి’ మెగాస్టార్ కలయికలో అద్భుతమైన ఎమోషన్ పండబోతుంది.
సిస్టర్ పాత్రను చేయడానికి కీర్తి సురేష్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా అంగీకరించారు. ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలను పెట్టడానికి మెహర్ రమేష్ ఈ స్క్రిప్ట్ పై దాదాపు మూడేళ్ళు పని చేశాడు. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను మెహర్ రమేష్ చాలా బాగా పట్టుకున్నాడని టాక్.
అలాగే స్క్రిప్ట్ లో డైలాగ్స్ ను స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా అద్భుతంగా రాశాడట. అయితే, సినిమా లేక దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయిన మెహర్ రమేష్ కి మెగాస్టార్ పెద్ద మనసుతో పిలిచి మరీ ఆవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే. మెగాస్టార్ గొప్ప మనసుకు కచ్చితంగా ఇది గొప్ప నిదర్శనమే. కెరీర్ లో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయినా మెహర్ రమేష్, ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు.