CM Jagan- Ram Gopal Varma: ఊరికే రారు మహానుభావులు అని ఏపీ సీఎం జగన్ ను ఆయన తాడేపల్లిలోని సీఎం నివాసంలో రహస్యంగా కలిశాడు ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ మధ్య సినిమాల కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యలతోనే వర్మ పాపులర్ అవుతున్నాడు. సమకాలనీ రాజకీయ, సినిమా అంశాలపై నోరుపారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఇటీవలే ‘కొండా సురేఖ’ దంపతులపై వర్మ తీసిన బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో.? ఎన్ని రోజులు ఆడిందో కూడా తెలియని పరిస్తితి.

అయితే బయోపిక్ లను బాగా తీయగలడన్న పేరు వర్మకు ఉంది. పైగా ఏపీ సీఎం జగన్ అంటే వర్మకు వల్లమాలిన అభిమానం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన్ను సపోర్టు చేశాడు వర్మ. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా హాజరయ్యాడు కూడా. ఇక జగన్ ను తిట్టేవారిపై తనదైన శైలిలో కౌంటర్లు వేశాడు. జగన్ కు ప్రత్యర్థి అయిన చంద్రబాబుపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమా తీసి ఆయన్ను విలన్ గా ప్రొజెక్ట్ చేశాడు.
ఇప్పుడు సీఎం జగన్ ను సీక్రెట్ గా తాడేపల్లిలో వర్మ కలవడం వెనుక కథే వేరే ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. జగన్ తాత, ఒకప్పటి ఫ్యాక్షనిస్ట్ అయిన రాజారెడ్డి బయోపిక్ కు వర్మ ప్లాన్ చేశాడని.. దీనికోసం జగన్ అనుమతితోపాటు కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. అందుకే ఇది లీక్ కాకుండా రహస్యంగా జగన్ నివాసానికి వచ్చినట్టు సమాచారం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు కాస్త దూరంగానే ఉండేవారు. కానీ రాజారెడ్డి రెబల్ అని పేరుంది. రాజారెడ్డి పోలికలే జగన్ కు వచ్చాయని అంటుంటారు. మరి అలాంటి ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి బయోపిక్ ను వర్మ తీస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఖాయం. అది ఎలా ఉంటుందన్నది వేచిచూడాలి.