Modi Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రిటైర్ అయిపోయారు. ఆయన ఈనెల 10తో ఉపరాష్ట్రపతిగా వీడ్కోలు పలకనున్నారు. ఈక్రమంలోనే ఐదేళ్లుగా రాజ్యసభలో అన్నీ తానై వ్యవహరించిన వెంకయ్యనాయుడిలో సభ చివరి రోజును చూడగానే కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వాటిని అదిమిపెట్టుకుంటూ ఆయన కళ్లలో నీళ్లు తుడుచుకుంటూ రాజ్యసభ చైర్మన్ హోదాలో కూర్చున్నారు.
ప్రధాని ప్రసంగం మొదలైంది. వెంకయ్యనాయుడిలోని క్వాలిటీలు గుర్తు చేస్తూ.. ఆయన రాజకీయాల్లోంచి రిటైర్ అయినా ఆయన చెప్పిన పాఠాలు, జీవితాంతం జ్ఞానం అందించేలా ఉంటాయని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ‘వెంకయ్య ఏక వాక్యంతో సంబంధించే తీరును మోడీ పొగిడాడో.. తిట్టాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అవి చాలా చమత్కారంగా ఉంటాయని తెలిపారు. కొన్ని సార్లు అవే విజయ సూత్రాలుగానూ మారాయని కొనియాడాడు. ఎన్నడూ కౌంటర్ చేయలేదని.. ఆయన మాటల్లో లోతైన భావం ఉంటుందని కొనియాడారు.
ఇక వెంకయ్య రాజకీయాల నుంచే రిటైర్ అవుతున్నారు కానీ.. ప్రజా జీవితం నుంచి అలిసిపోలేదని’.. ఇక్కడితో వెంకయ్య బాధ్యతలు ఆగిపోవంటూ మోడీ తనదైన శైలిలో వెంకయ్యపై ప్రశంసలు కురిపించారు.
ఒకప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా.. రాజ్యసభ ఎంపీగా.. అనంతరం మోడీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా వెంకయ్య పనిచేశారు. మోడీ మొదటి ప్రభుత్వంలో ఆయనను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి ‘ఉపరాష్ట్రపతి’గా మోడీ ఎంపిక చేశారు. ఉత్సవ విగ్రహం లాంటి పదవిలో కూర్చుండబెట్టారు.
తనకు యాక్టివ్ పాలిటిక్స్ ఇష్టమని.. ప్రజల్లో తిరిగి వారికి సేవ చేయడం ముఖ్యమని వెంకయ్య చాలా సార్లు అన్నా ఆయనను మాత్రం ఉపరాష్ట్రపతిగా పంపించేశారు మోడీ షాలు. ఇక రెండో దఫా మరోసారి ఛాన్స్ ఇవ్వకుండా ఒకసారికే పరిమితం చేసేశారు. ఇప్పుడు రిటైర్ మెంట్ వేళ మోడీ ఎంత గొప్పగా ప్రశంసించినా కూడా వెంకయ్యనాయుడులో ఇక తాను రిటైర్ అవుతున్నానన్న బాధ, ఆవేదన కనిపించింది. అదే కన్నీళ్లుగా మారి ఉబికి వచ్చినట్టైంది.
ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ ఇచ్చిందని.. ఆ సమయంలో బీజేపీకి రాజీనామా చేసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయని వెంకయ్య ఎమోషనల్ అయ్యారు. ఆ పదవి నేను అడగలేదని.. పార్టీ ఆదేశాలు శిరసావహించి పార్టీకి రాజీనామా చేశానని వెంకయ్య అన్నారు. దీన్ని బట్టి బీజేపీ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరం జరగడం తనకు ఇష్టం లేదని వెంకయ్య చెప్పకనే చెప్పినట్టైంది.