Janasena Campaign : మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన ఈసారి సత్తా చాటాలని చూస్తుంది. టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. జనసేన తరపున పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు బరిలో దిగుతున్నారు. ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తుంది. గతంలో నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు.
నాగబాబు ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో ఆయన కుమారుడు వరుణ్ తేజ్ జనసేన తరపున ప్రచారం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్ దీనిపై స్పష్టత ఇచ్చాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు క్యాంపెన్ చేస్తారా? అని అడగ్గా…”దాని గురించి ఇంకా ఆలోచించలేదు. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా పాటించడానికి రెడీగా ఉన్నాను. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను…” అని వెల్లడించారు.
వరుణ్ తేజ్ మాటలు పరిశీలిస్తే జనసేనకు ఆయన స్టార్ క్యాంపైనర్ అవడం ఖాయం అనిపిస్తుంది. జనసేన తరపున మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ప్రచారం చేస్తారని సమాచారం అందుతుంది. మరోవైపు పరోక్షంగా చిరంజీవి, రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి తమ మద్దతు ప్రకటించారు. కావున మెగా హీరోలందరూ జనసేనకు ప్రచారం కల్పిస్తున్నట్లే లెక్క.
ఇక వరుణ్ తేజ్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఆయన ఏడడుగులు వేశాడు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పరంగా చూస్తే… వరుణ్ గత రెండు చిత్రాలు గని, గాండీవధారి అర్జున నిరాశపరిచాయి. నెక్స్ట్ ఆయన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటిస్తున్నారు. భారత వైమానిక దళం నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధం కాగా… ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.