MP Raghurama vs Jagan : ఆ అధికారికి జగన్ మాటే వేదం. జగన్ మాటే శాసనం. జగన్ కళ్లలో ఆనందం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏమైనా చేస్తారు. అంతటి గొప్ప స్వామిభక్తి గల అధికారికి పెద్ద కష్టమొచ్చింది. ఉన్నట్టుండి బదిలీ తలుపు తట్టింది. అనూహ్య పరిణామంతో అవాక్కవ్వడం ఆయన వంతు అయింది. ఇంతకీ ఆ అధికారి ఎవరు ? ఆ కథేంటి అనుకుంటున్నారా ? అయితే స్టోరీ చదివేయండి.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ తో ఆ అధికారి ఫేమస్ అయ్యారు. రఘురామ మరింత ఫేమస్ అయ్యారు. రఘురామను అంత ఫేమస్ చేసిన అధికారి ఎవరంటే ఏపీ సీఐడీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్. ఏపీ ప్రభుత్వం పై ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. రఘరామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రఘురామకృష్ణరాజును భీమవరంలో అడుగుపెట్టకుండా సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ఉక్కిరిబిక్కిరి చేశారు.
ఏపీ సీఐడీ చీఫ్ పీవీ. సునీల్ కుమార్ సీఎం జగన్ కు ప్రీతిపాత్రుడిగా పేరుంది. తన పదవీ కాలంలో సీఎం జగన్ చెప్పినట్టు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారి పై వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుండి చర్యలు తీసుకుంది. సీఐడీ చీఫ్ పదవి నుంచి తప్పించింది. మరోచోట పోస్టింగ్ కూడ ఇవ్వలేదు. హఠాత్తుగా జీవో విడుదల చేసింది. ఆయనను జీఏడీకి రిపోర్ట్ చేయాలని జీవోలో పేర్కొంది. సునీల్ స్థానంలో సీఐడీ ఏడీజీగా ఎన్. సంజయ్ ను నియమించింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పీవీ. సునీల్ కుమార్ ను బదిలీ చేయడం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల వరకు సునీల్ ను కొనసాగిస్తారని చాలా మంది భావించారు. కానీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఎంపీ రఘురామ విషయంలో సునీల్ దారుణంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సునీల్ పై రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో పీవీ. సునీల్ ను బదిలీ చేసి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చాలా రోజులుగా పీవీ సునీల్ ను ఏపీ సీఐడీ చీఫ్ గా తప్పించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు. చివరికి రఘురామకృష్ణరాజు డిమాండ్ జగన్ నెరవేర్చినట్టయింది.