Rashmika Mandanna Pushpa 2 : పుష్ప సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి. 2021 డిసెంబర్ 17న ఐదు భాషల్లో విడుదలైన పుష్ప, ఊహించని విజయం నమోదు చేసింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ పై పెద్దగా అంచనాలు లేవు. టీమ్ ప్రమోషన్స్ కూడా నిర్వహించలేదు. దీంతో దారుణమైన ఓపెనింగ్స్ దక్కాయి. పుష్ప హిందీ ఫస్ట్ డే వసూళ్లు కేవలం రూ. 3 కోట్లు. పుష్ప డిజాస్టర్ కావడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు ఓపెనింగ్స్ ఆధారంగా నిర్ణయానికి వచ్చారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వర్డ్ ఆఫ్ మౌత్ విపరీతంగా పని చేసింది. రోజురోజుకూ వసూళ్లు పుంజుకున్నాయి.
లాంగ్ రన్ లో వంద కోట్ల మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్, మాస్ మేనరిజమ్స్ కి దేశం ఫిదా అయ్యింది. పుష్ప చిత్రం గురించి బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడిచింది. వరల్డ్ వైడ్ పుష్ప అన్ని భాషల్లో రూ. 360 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ బడ్జెట్ డబుల్ చేశారు. పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లకు పెంచారట. స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు చేశారట.
ఈ కారణంగా హీరోయిన్ రష్మిక మందానకు అన్యాయం చేశారంటున్నారు. మొదట లాక్ చేసిన స్క్రిప్ట్ ని సమూలంగా మార్చేశారట. పుష్ప 2 కోసం అనుకున్న కథలో భారీ మార్పులు చోటు చేసుకున్నారట. ముఖ్యంగా శ్రీవల్లి పాత్ర ప్రాధాన్యత, నిడివి తగ్గించేశారట. కొత్త నటులను తీసుకోవడం వలన రష్మిక చేస్తున్న శ్రీవల్లి పాత్రకు ప్రాధాన్యత లేకుండా పోయిందట. పుష్ప 2 తన కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశ పడుతున్న తరుణంలో ఆమెకు దర్శకుడు సుకుమార్ బిగ్ షాక్ ఇచ్చారంటున్నారు.
మరొక వాదన ఏంటంటే… రష్మిక పాత్ర చనిపోతుందట. గత ఏడాది సిల్వర్ స్క్రీన్ రికార్డ్స్ తిరగరాసిన కెజిఎఫ్ 2 క్లైమాక్స్ ని పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్ పోలి ఉండనుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇటీవల వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.