‘జాతిరత్నాలు’ మూవీతో తెలుగు తెరపై దూసుకొచ్చాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఆ సినిమాలో కామెడీ టైమింగ్ తో అలరించి అందరి మనసు దోచుకున్నాడు. ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్నాడు. ‘జాతిరత్నాలు’ హిట్ తో నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. పలువురు అడ్వాన్సులు ముట్టజెప్పారు. ఈ డిమాండ్ తో తన పారితోషికాన్ని ఏకంగా రూ.4 కోట్లకు పెంచుకున్నాడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetti).
సితారా ఎంటర్ టైన్ మెంట్స్(Sithara Entertainments) సంస్థలో ఓ సినిమా చేయడానికి నవీన్ పొలిశెట్టి ఒప్పందం చేసుకొని ఏకంగా పారితోషికంగా రూ.4 కోట్లు మాట్లాడుకున్నాడు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ‘రంగ్ దే’ కోడైరెక్టర్ తో నవీన్ కు కథ కూడా చెప్పించారు. నవీన్ ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అది చేసినా కథ ఓ దారికి రాకపోవడంతో ఇక సినిమా చేయడం వీలు కాదని నవీన్ చెప్పేశాడట.. ఈ కథను పూర్తిగా పక్కనపెట్టేశాడట.. దాంతోపాటుగా తనకు అడ్వాన్స్ ఇచ్చిన సితార సంస్థకు కూడా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి హీరో నవీన్ షాకిచ్చినట్టు టాలీవుడ్ టాక్.
అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం నవీన్ కు సరితూగే కథల కోసం ఇప్పుడు అన్వేషణలు మొదలుపెట్టిందట.. ఎలాగైనా నవీన్ తో సినిమా తీయాలని వారు యువ దర్శకులు కథల కోసం వేచిచూస్తున్నట్టు సమాచారం.
ఇక నవీన్ సితార నుంచే కాదు.. ప్రభాస్ స్నేహితుల సంస్థ ‘యూవీ క్రియేషన్స్’ (UV Creations) నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నాడట.. యూవీలో సినిమా ఈ పాటికే ప్రారంభం కావాల్సి ఉంది. ఆ కథ కూడా ఓకే అయినట్టు తెలిసింది. మరి ఈ సినిమా కూడా పట్టాలెక్కపోవడంతో ఈ యువ హీరోకు కథ చెప్పి సినిమాకు ఒప్పించడం కష్టమన్న టాక్ నడుస్తోంది.