Homeఆంధ్రప్రదేశ్‌Nandamuri Balakrishna: బాలయ్యకు అరుదైన గౌరవం.. గత ఏడాది పద్మ విభూషణ్.. ఇప్పుడు లైఫ్ టైం...

Nandamuri Balakrishna: బాలయ్యకు అరుదైన గౌరవం.. గత ఏడాది పద్మ విభూషణ్.. ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్

Nandamuri Balakrishna: భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna). స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమారుడిగా సినీ అరంగేట్రం చేసిన బాలకృష్ణ తనకంటూ సొంత మేనరిజం ఏర్పాటు చేసుకున్నారు. లక్షలాదిమంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. కేవలం సినిమా రంగంలోనే కాదు.. రాజకీయ, సేవా రంగాల్లో కూడా తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ది ఢిల్లీ. సినీ రంగంలో దశాబ్దాల సేవకు గాను గుర్తిస్తూ ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా చేతుల మీదుగా. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. నందమూరి బాలకృష్ణ కు అవార్డు రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

* అన్ని జోనర్లలోనూ నటన..
తెలుగు చిత్ర పరిశ్రమలో (Telugu cinema industry) మాస్ యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ అడ్రస్. పౌరాణిక, సాంఘిక, జానపద, సైన్స్ ఫిక్షన్.. ఇలా అన్ని జోనర్లలోనూ తన నటనా రూపాన్ని చూపించారు నందమూరి బాలకృష్ణ. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. 1974లో తాతమ్మ కల అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 109 సినిమాల్లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు రాజకీయాల్లో సైతం సత్తా చాటుకుంటున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జనం మెచ్చే నటుడిగా, ప్రజా ప్రతినిధిగా ఆయన బహుముఖంగా రాణిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గాను సేవలందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఏటా వేలాదిమంది క్యాన్సర్ రోగులకు నాణ్యమైన చికిత్సను అందించగలుగుతున్నారు.

* తండ్రి దర్శకత్వంలోనే తొలి సినిమా..
బాలయ్య తన జీవితకాలంలో ఎన్నో అవార్డులను, రిపోర్టులను అందుకున్నారు. చిన్ననాటి నుంచి తన తండ్రి నందమూరి తారక రామారావును( Nandamuri Taraka Rama Rao ) ఆదర్శంగా తీసుకున్నారు. ఎన్టీఆర్ దర్శకత్వంలోనే బాలకృష్ణ నటన జీవితాన్ని ప్రారంభించారు. 1974లో ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల సినిమా తెరకెక్కింది. 14 సంవత్సరాల వయసులో ఆయన ఆ సినిమాలో తొలిసారిగా నటించారు. అక్కడకు రెండేళ్ల తర్వాత అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఒక హీరోగా నటించారు. అయితే ఎక్కువగా తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించారు బాలకృష్ణ. 1984లో సాహసమే జీవితం సినిమాలో తొలిసారిగా బాలకృష్ణ హీరోగా నటించారు. 1987లో బాలకృష్ణ హీరోగా నటించిన ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం కూడా కొనసాగింది. అత్యధికంగా నందమూరి బాలకృష్ణ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 13 సినిమాల్లో నటించారు. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడిలో బాలకృష్ణ తన తండ్రి పాత్రలో మెప్పించారు

* ఎన్నో మైలురాళ్లు..
బాలకృష్ణ సినిమా కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఆయన నటించిన 23 చిత్రాలు సంక్రాంతి సమయంలోనే విడుదలయ్యాయి. ఆయన నటించిన లెజెండ్ చిత్రం ఏకంగా వెయ్యి రోజులపాటు ఆడడం విశేషం. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ పదికి పైగా సినిమాల్లో నటించారు. 17 సినిమాల్లో డబుల్ రోల్లో మెప్పించారు. అధినాయకుడు చిత్రంలో అయితే త్రిపాత్రాభినయం చేశారు. స్వతహాగా లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడైన బాలకృష్ణ సింహ పేరుతో తీసిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెర హోస్ట్ గాను తనదైన ముద్ర చాటుకున్నారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ అంటూ ఆయన చేసిన కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. సినిమా రంగంతో పాటు సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. అయితే సినిమా రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా చేసిన సేవలకు గాను ఇప్పుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular