Jagan Gift: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న ఒక ముక్క ఎక్కువే దొరుకుతుందున్నది సామెత. ఇప్పుడు ఏపీ టికెట్ రేట్ల తగ్గింపు.. థియేటర్లలో 50శాతం ఆక్యూపెన్సీపై టాలీవుడ్ సినీ పెద్దలంతా జుట్టు పీక్కుంటే.. టాలీవుడ్ అగ్ర హీరో కింగ్ నాగార్జున మాత్రం బిందాస్ గా తన సినిమాను సంక్రాంతి రేసులో నిలిపి విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ఏపీలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈరోజు నుంచే ఈ కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ సర్కార్ యోచించింది. కానీ తాజాగా కీలక మార్పు చేసింది.
సంక్రాంతి పండుగ తర్వాత నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే దాదాపు వారం తర్వాత 18వ తేదీ నుంచి నెలాఖరు వరకూ రాష్ట్రమంతా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈరోజు నుంచి నైట్ కర్ఫ్యూ పెడుతానన్న జగన్ సడెన్ గా ఎందుకు ఈనెల 18వరకూ కర్ఫ్యూను సంక్రాంతి పేరుతో వాయిదా వేశాడని అందరూ ఆరాతీస్తున్నారు. పైగా సంక్రాంతి సెలవులను కూడా పొడిగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి కొందరు ఆయన తన ఫ్రెండ్ కోసమే ఈ వెసులబాటు కల్పించారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అగ్రహీరో నాగార్జున ఎప్పటి నుంచో జగన్ కు జిగ్రీ దోస్త్… .జగన్ అధికారంలోకి రాకముందే నాగార్జున ఆయనపై అభిమానం చూపేవారు.. కలిసి మాట్లాడేవారు. జగన్ సీఎం అయ్యాక ఆయన వద్దకు నేరుగా వెళ్లేంత ధైర్యం, చొరవ, సాన్నిహిత్యం కేవలం నాగార్జునకే ఉందంటారు.
ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదాతో సంక్రాంతికి సినిమాలు లేనివేళ కింగ్ నాగార్జున తన సినిమా ‘బంగార్రాజు’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అయితే విడుదల వేళ జగన్ సర్కార్ నైట్ కర్ఫ్యూ పెట్టింది. దీంతో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ప్రకటించింది.
దీనివల్ల నాగార్జున ‘బంగార్రాజు ’ మూవీకి సెకండ్ షో పడదు.. ఈ సంక్రాంతి వేళ సినిమాకు భారీ నష్టం. దీంతో సినిమా వాయిదాకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పట్టుబట్టారు. కానీ ఏమైందో ఏమో కానీ.. జగన్ సర్కార్ సెలవులు పొడిగించి ఏకంగా నైట్ కర్ఫ్యూను ఈరోజు నుంచి కాకుండా 18వ తేదీకి వాయిదా వేసింది. సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఇలా చేశామని చెప్పుకొచ్చింది.
కానీ ఇది తన ఫ్రెండ్ నాగార్జున కోసమే జగన్ నైట్ కర్ఫ్యూను వాయిదా వేశాడని.. ఆయనతో సాన్నిహిత్యం వల్లే బంగార్రాజు కలెక్షన్లకు దెబ్బ పడకుండా జగన్ ఈ వెసులుబాటు కల్పించారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ ఏ నిర్ణయంతో నైట్ కర్ఫ్యూ వాయిదా వేసిందో తెలియకున్నా.. ఇది నాగార్జున సినిమాకు కలిసి వస్తుందని అంటున్నారు. నాగార్జునకు జగన్ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.